బీజేపీకి ఆయన జాతీయ కార్యదర్శి. కానీ చంద్రబాబన్నా, టీడీపీ అన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అలాగని టీడీపీపై నేరుగా ప్రేమను చాటుకోలేని దయనీయస్థితి. వైసీపీపై ఆయన ఒంటికాలి మీద లేస్తుంటారు. సొంతూరు ప్రొద్దుటూరులో కనీసం తన వార్డుకు కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోలేని జాతీయ నాయకుడాయన. బీజేపీలో ఇలాంటి వాళ్లు కోకొల్లలు. ఇదే ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి ప్రధాన కారణం.
గతంలో చంద్రబాబుపై ప్రధాని మోదీ విమర్శల్ని ఆయన మరిచినట్టున్నారు. పోలవరం అవినీతిపై విచారించాలనే ధ్యాస ఆయనలో కొరవడింది. అమరావతిలో ఇవాళ బీజేపీ నాయకుడు సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ ఏటీఎంలానే చూశారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేస్తేనే కేంద్రం నిధులిస్తుందని చెప్పడం గమనార్హం.
రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ మంత్రులు పోలవరంపై దృష్టి సారించడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుపై గతంలో ఎన్ని అవినీతి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కానీ ఏం తేల్చారు? అని సత్యకుమార్ ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయడానికే నిధులు అవసరమని సత్యకుమార్‌కు తెలియకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోలవరం నిర్మించేంతగా నిధులుంటే ఇంతకాలం జాప్యమెందుకు అవుతుంది? ఆ మాత్రం కూడా తెలియకుండా సత్యకుమార్ మాట్లాడుతున్నారా?
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజమండ్రి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పోలవరంపై ఆరోపణలను సత్యకుమార్ మరిచిపోయినట్టున్నారు. చంద్రబాబు పోలవరం అంచనాలను అవసరమెుచ్చినప్పుడల్లా పెంచుతూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. పోలవరం నిర్మాణానికి తామిచ్చిన రూ.7వేలు కోట్ల నిధులు ఏమయ్యాయని మోదీ ప్రశ్నించారు. ఈసీలు ఇవ్వలేదని, నిధులు ఎక్కడికెళ్లాయో అందరికీ తెలుసని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరంపై స్వయంగా ప్రధానే ఆరోపణలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ చేతిలో సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలున్నాయి. మరి అవినీతిపై విచారణ ఎందుకు జరపలేదో సత్యకుమార్ సమాధానం చెప్పాలి. టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యమైతే, ఆ పార్టీలో చేరవచ్చు కదా? అని బీజేపీ నేతలే చెబుతుండడం విశేషం. గతంలో టీడీపీకి బీజేపీలోని ఓ పెద్దాయన బలమైన అండగా ఉండేవారు. బహుశా ఆ లోటును పూడ్చేందుకు సత్యకుమార్ ఉండాలని భావిస్తున్నారేమో అని సొంత పార్టీ నేతల నుంచి సెటైర్స్ రావడం గమనార్హం.