విశాఖ రాజధాని గురించి చర్చ ఒక వైపు సాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ నేతల నుంచి జనాలలోకి మెల్లగా వెళ్తోంది. కొన్ని వర్గాలు దీని మీద డిబేట్లు పెడుతున్నాయి. విద్యార్ధి సంఘాలు అయితే మా విశాఖ రాజధాని కావాలని నినదిస్తున్నారు.
వీటి మధ్యలో ఆశ్చర్యకరంగా ఏయూ వీసీ కూడా విశాఖ రాజధానిని సమర్ధిస్తూ మాట్లాడడం విశేషం. విశాఖ ఎప్పటికైనా రాజధాని అవుతుంది. ఆ సామర్ధ్యం సత్తా ఈ ప్రాంతానికి ఉన్నాయని వీసీ ప్రసాదరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానిగా అంతా కోరుకుంటున్నారు అని ఆయన చెప్పారు.
విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్రా మొత్తం బాగుపడుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాంతాలు బాగుపడడం ఇష్టం లేని వారే వ్యతిరేకిస్తారని కూడా సూత్రీకరించారు. అంతే కాదు ఒక అడుగు ముందుకేసి అమరావతి పేరిట పాదయాత్ర చేస్తున్న వారికి విశాఖ సహా ఈ ప్రాంతాలు బాగుపడడం ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రా వాసులకు విశాఖ రాజధాని కావాలన్న కోరిక ఉందని అది జనాల చిరకాల వాంచ అని ఆయన పేర్కొన్నారు. విశాఖ రాబోయే కాలానికి కాబోయే రాజధాని అని వీసీ గట్టిగా చెప్పడం గమనార్హం. అయితే వీసీ వ్యాఖ్యల పట్ల టీడీపీ మండిపడుతోంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని విమర్శిస్తోంది. అయినా సరే తన వాదన ఇదే అని వీసీ చెప్పాల్సింది చెప్పేశారు.