కవి కంటే గొప్పవారు లేరు. వారు గతాన్ని వర్తమానాన్నే కాదు, భవిష్యత్తును కూడా దర్శిస్తారు. ప్రజల నాలికలపైన శాశ్వతంగా వారు నిలిచిపోతారు. చిరకీర్తిని ఆర్జిస్తారు. అలాంటి కవులను అదరించిన రాజులు కూడా అంతే ఖ్యాతిని ఆర్జిస్తారు.
ఉత్తరాంధ్రా జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు వంటి వారిని ఎందరినో సమాదరించిన ఘనతను జగన్ ప్రభుత్వం దక్కించుకుంది. వంగపండు గత ఏడాది మరణిస్తే ప్రభుత్వ లాంచనాలతో ఆయన అంతిమ సంస్కారం జరిపించిన గొప్పతనం వైసీపీదే.
ఇక వంగపండు తొలి వర్ధంతి వేళ విశాఖలో అతి పెద్ద కవితా సంబరాన్ని అంబరాన్ని తాకేలా నిర్వహించి జగన్ శభాష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా వంగపండు వర్ధంతిని జరిపించి ఆ కవిరాజును మరోమారు జనం తలచుకునేలా చేశారు.
జగన్ సర్కార్ వంగపండు వంటి కవులను ఆదరిస్తున్న తీరు ప్రశంసనీయమని ప్రజా నటుడు, రచయిత అయిన ఆర్ నారాయణమూర్తి కొనియాడారు. ఈ సభకు హాజరైన గద్దర్ మాట్లాడుతూ వంగపండు వంటి కవి ఉత్తరాంధ్రా వారు కావడం ఈ గడ్డ చేసుకున్న పుణ్యమని అన్నారు.
ఇక వంగపండు విగ్రహాన్ని కూడా విశాఖ బీచ్ రోడ్డులో ప్రముఖ కవుల విగ్రహాల సరసన ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. ఈ సందర్భంగా వంగపండు పేరుతో ప్రతీ ఏటా రెండు లక్షల రూపాయల నదగు పురస్కారాన్ని జానపద కళాకారులకు అందిస్తున్నామని కూడా మంత్రి చెప్పడం విశేషం. మొత్తానికి కవులను గౌరవించడంతో వైసీపీ తనకు సాటి లేరు అనిపించుకుంది అని చెప్పాల్సిందే.