నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామాకు రెడీ అని ప్రకటించారు. అయితే తనతో పాటు వైసీపీ ఎంపీలంతా రాజీనామాకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఏపీలో అమరరాజా కంపెనీ తరలింపు, అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అమర్‌రాజా కంపెనీ తరలిపోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారని రఘురామకృష్ణంరాజు అన్నారు. అమర్‌రాజా కంపెనీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అదనపు భూకేటయింపులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పుడులేని తప్పులు ఇప్పుడు ఎలా కనపడ్డాయని ఆయన ప్రశ్నించారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ తనను అంతు చూస్తానన్నందుకు ఆయన్ను అభినందించారని తెలిసిందన్నారు. ప్రెస్‌మీట్ పెడితే లేపేస్తారా? పిచ్చి ఉడుత ఊపులు ఊపొద్దని వైసీపీ నేతలకు ఆయన హితవు చెప్పారు. తాను ధర్మ పోరాటం చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు కోసం తాను కూడా రాజీనామాకు రెడీ అని రఘురామ ప్రకటించడం విశేషం. వైసీపీ ఎంపీలందరం కలిసి రాజీనామాలు చేద్దామని ఆయన పిలుపునివ్వడం గమనార్హం.
తమను వ్యతిరేకిస్తున్న రఘురామ పదవికి రాజీనామా చేయాలని ఎప్పటి నుంచో వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పోరాటం చేస్తున్నా, ఫలితం కనిపించలేదు. విశాఖ ఉక్కు కోసం రాజీనామా అంటూ రఘురామ సమయం చూసుకుని పంచ్ విసిరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.