ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి తమ ఆదేశాలు పాటించకపోవడంపై హైకోర్టు అసహనం ప్రదర్శించింది. ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఉపాధిహామీ బిల్లులు సకాలంలో చెల్లించాలని గతంలో ఆదేశించామని, తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీసింది. న్యాయస్థానం ఆదేశాలంటే గౌరవం లేదా? అని హైకోర్టు గట్టిగా ప్రశ్నించింది.
ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ…ఇప్పటికే రూ.413 కోట్లు చెల్లించామని, నాలుగు వారాల్లో మరో రూ.1,117 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ల తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం కేవలం రూ.40 కోట్లు మాత్రమే చెల్లించిందని వాదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందిస్తూ ఏ గ్రామపంచాయతీకి ఎంత చెల్లించారో పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదే సందర్భంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఉపాధి హామీ బిల్లులపై విజిలెన్స్ విచారణలో ఏం తేలిందని ద్వివేదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు.
సంబంధిత విషయాలేవీ తెలుసుకోకుండా కోర్టుకు ఎలా వస్తారని ద్వివేదిపై మండిపడింది. ఈ కేసులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎందుకు హాజరు కాలేదని కోర్టు ప్రశ్నించింది. హాజరు మినహాయింపు పిటిషన్లో కారణాలు ఎందుకు చెప్పలేదని నిలదీసింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించింది.
ఒకవేళ హాజరుకాకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. ఉపాధిహామీ బిల్లుల వ్యవహారం న్యాయస్థానంలో సీరియల్‌ను తలపిస్తోంది. ఉపాధిహామీ బిల్లులను కూడా సంక్షేమ పథకాలకు వాడుకుంటుండంతో కూలీల చెల్లింపులకు ఇబ్బంది తలెత్తిందనే అభిప్రాయాలున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్లకే బిల్లులు… లేదంటే ఎన్నాళ్లైనా చెల్లింపులు లేని పరిస్థితి.