కాకుల లెక్కల్లో కమ్మలెక్కలు వేరయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏది ఉండాలి? అనే విషయం రాష్ట్ర అవసరాలు, ప్రజల అవసరాలు అనే అంశాలను దాటిపోయి కేవలం రాజకీయ వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి నేడు ఉంది. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏది ఉండాలి? అనే విషయం రాష్ట్ర అవసరాలు, ప్రజల అవసరాలు అనే అంశాలను దాటిపోయి కేవలం రాజకీయ వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి నేడు ఉంది. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని తెలుగుదేశం మరియు దాని తైనాతీ వర్గాలు.. కాదు జగనన్న చెప్పినట్లుగా మూడు రాజధానులు ఉంటే మాత్రమే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని వైయస్సార్ కాంగ్రెస్ మరియు వారి తొత్తులు వాదించుకోవడం పరిపాటి అయిపోయింది. తటస్తులు ఏం మాట్లాడుతున్నారు అనేదానికి ఎక్కడా విలువలేదు. 

జగన్ శాసనసభ సాక్షిగా అమరావతి ఏ రకంగా అసాధ్యమైన ప్రాజెక్టు అవుతుందో లెక్కలతో సహా వివరించారు. ఆయన చెప్పిన ప్రతి మాట తప్పు అని వాదించడానికి ఇప్పుడు ఈనాడు పూనుకున్నది. జగన్ చెప్పిన ప్రతి మాట అబద్ధం అంటూ వారికి తోచిన కాకుల లెక్కలు వారు వండి వార్చారు. ఈ అంశాలన్నింటినీ పక్కన పెడితే ఒకే ఒక్క కోణంలో ఈనాడు కథనాన్ని గమనిస్తే వారు ఎంతగా వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టదలుచుకుంటున్నారో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.

అమరావతి రాజధాని అనేది కేవలం కమ్మ కులానికి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు నెత్తికెత్తుకున్న వ్యవహారం అనే ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. లేదు ఇది కేవలం కమ్మ కులానికి సంబంధించినది కాదు వారితో పాటు నిమ్న కులాలు అన్ని వర్గాల వారు కూడా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఉన్నారు అని మరో వర్గం వాదిస్తూ ఉంటుంది. 

ఇవాళ ఈనాడు తమ కథనంలో.. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులలో.. ఏ కులాల వారు ఎందరు ఉన్నారో ఒక లెక్క చెప్పింది. ఆ లెక్క చూస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా బొంకుతున్నదో కదా అని అందరికీ ఆగ్రహం కలుగుతుంది. ఇది కమ్మ కులం కోసం చేస్తున్న రాజధాని అని అనవసరంగా అభాండాలు వేస్తున్నారని అభిప్రాయం బలపడుతుంది. 

కానీ అదే కథనంలో ఈనాడు మరో పని కూడా చేసింది. ఎంత విస్తీర్ణం పొలాలు ఇచ్చిన రైతులు ఎంతెంత మంది ఉన్నారో ఆ లెక్కలు కూడా చెప్పింది. కానీ అశ్వద్ధామ హతః కుంజరః అనే కురుక్షేత్రం సూక్తి మాదిరిగా సగం సగం నిజాలను వేర్వేరు చోట్ల చెప్పి, ఈనాడు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించింది.

ఈనాడు కథనంలోని కులాల లెక్కల ప్రకారం వారి శాతాలు ఇలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు 32, రెడ్లు 23, కమ్మ 18, బీసీలు 14, కాపులు 9, మైనారిటీలు 3, ఇతరులు 1 శాతం ఉన్నారు. అయినా సరే అమరావతిని కమ్మకుల రాజధానిగా ముద్ర వేస్తున్నారని ఆక్రోశం ఈనాడు పదేపదే వ్యక్తం చేసింది. 

ఇదే కథనంలో మరొక చోట విస్తీర్ణాల లెక్కలు చెప్పారు. ఎకరంలోపు భూమి ఇచ్చిన వారు 20వేల మంది మొత్తం విస్తీర్ణం పదివేల ఎకరాలు, రెండు ఎకరాల్లోపు భూమి ఇచ్చిన రైతులు 5000 పైచిలుకు ఐదు ఎకరాల్లోపు భూమి ఇచ్చిన రైతులు 3300 మంది.. ఈ గణాంకాలు కూడా చాలా బాగున్నాయి అమరావతి కోసం పేదలంతా త్యాగం చేశారు అని మనం నమ్మేలాగానే ఉన్నాయి. 

ఈ రెండు రకాల గణాంకాలను సమన్వయం చేసి మొత్తం రైతుల ఇచ్చిన 34323 ఎకరాలలో ఏ కులం వారు ఇచ్చిన విస్తీర్ణం ఎంత ఉన్నది అనే లెక్కలు తీస్తే కనుక అసలు మర్మం బోధపడుతుంది. అమరావతి రాజధాని కోసం కమ్మ కులం మాత్రమే ఎందుకు ఆరాటపడుతున్నదో అర్థమవుతుంది. సగం సత్యాలను దాచి తమకు తోచిన రీతిలో ప్రచారం చేసినంత మాత్రాన ఈనాడు ప్రచురించే ప్రతి మాటను నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు అనే సంగతి వారు తెలుసుకోవాలి.