Advertisement

Advertisement


Home > Politics - Analysis

పవన్ కల్యాణ్.. చిలకజోస్యం దుకాణం!

పవన్ కల్యాణ్.. చిలకజోస్యం దుకాణం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోయి ప్రజలకు సేవ చేసేయాలని తపన పడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్, కొత్తగా చిలకజోస్యం దుకాణం పెట్టుకున్నారు. 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఆయన జోస్యం చెబుతున్నారు. 

అధికార పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది వాళ్ళ తలనొప్పి.. వాళ్ళు తేల్చుకుంటారు.. తమకెందుకు? తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తాము లెక్క చూసుకున్నారా పవన్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రకంగా తన సంగతి తాను పట్టించుకోవడం మానేసి, పక్కవారి సంగతులు పట్టించుకుంటూ ఉన్నంతకాలం ఆయన ఎదుగుదల కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉంటుందని జనం నవ్వుకుంటున్నారు.

ఇంతకు పవన్ కళ్యాణ్ తన చిలక జోస్యం రూపంలో చెప్పిన సంగతి ఏంటంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో కేవలం 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయట. ప్రస్తుతం 151 స్థానాలు గెలుచుకొని తిరుగులేని రీతిలో, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము గెలుచుకున్న సీట్లలోనే మూడింటి రెండు వంతుల సీట్లు కోల్పోతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఉవాచ. అక్కడికేదో తానే సర్వేక్షకుని అవతారం ఎత్తి రాష్ట్రమంతా తిరిగి జనాభిప్రాయాన్ని పోగు చేసినంత ఘంటాపథంగా పవన్ కళ్యాణ్ ఈ విషయం చెబుతున్నారు. 

వైసిపి కి ఎన్ని సీట్లు వస్తాయో లెక్క కచ్చితంగా చెబుతున్న పవన్ కళ్యాణ్- జనసేనకు ఎన్ని వస్తాయో చెప్పడానికి మాత్రం సాహసించడం లేదు. ఒకవేళ ఆయన ఏదైనా సర్వే చేయించి ఆ సర్వే ఫలితాలను నమ్ముతున్న విషయం నిజమే అయితే గనుక, జనసేన పార్టీ యొక్క డొల్లతనం మొత్తం ఆ సర్వేలో బయటపడిందని అనుకోవాలి. 

ఎందుకంటే ఇప్పుడు సర్వే మాట ఎత్తుతున్న పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి తాను రాష్ట్రమంతా తిరిగి జనం కష్టాలను పరిశీలిస్తారని వాగ్దానం చేసిన యాత్రను వాయిదా వేసుకున్నారు. అలాంటి యాత్ర చేపడితే కొత్తగా మరికొంత పరువు పోవడం తప్ప సాధించేది ఏమీ లేదని తనకున్న వాస్తవ జనాదరణ శూన్యం అనే సంగతి బయటపడి పోతుందని.. ఆయన భయపడినట్లుగా కనిపిస్తోంది. 

సభలు పెట్టి జనాన్ని తోలించి వారితో విజిల్స్ కొట్టించుకుంటే సరిపోతుందని భావించే ఈ సినిమా హీరో ప్రజల వద్దకు వెళ్లడానికి ఇప్పుడు జంకుతున్నారు. ఫిట్నెస్ విషయంలో తనంతటి మహానుభావుడు మరొకడు ఉండడు అని బీరాలు పలికే ఈ మార్షల్ ఆర్ట్స్ యోధుడు.. పాదయాత్ర లాంటిది కాకుండా బస్సు యాత్రను ఎంపిక చేసుకున్నారు. తీరా సందర్భం వచ్చేసరికి ఆ బస్సు యాత్ర చేయడానికి కూడా ఆయన వెనకాడుతున్నారు. ఆయనను పిరికితనం ఆవహించేస్తున్నది. పరువు పోతుందనే భయం వెన్నాడుతోంది. 

పవన్ కళ్యాణ్ కు నిజాయితీ ధైర్యం ఉంటే కనుక.. తాను చేయించిన సర్వేలో వైయస్సార్ కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం కాదు తన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వస్తాయని తేలిందో ఆ సంగతి బయట పెట్టాలి. సదరు సర్వేలో ‘‘తెలుగుదేశం పార్టీతో జతకడితే జనసేన’’, ‘‘తెలుగుదేశం పార్టీతో జత లేకుండా జనసేన’’ అని వారి అసలైన బలాలను విశ్లేషించుకున్నారో లేదో కూడా బయట పెట్టాలి. 

తాను సొంతంగా ఒక్క సీట్ అయినా గెలవగలనని నమ్మకం లేని ఈ జనసేనాని.. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి తెలుగుదేశం పార్టీతో జట్టు కడుతున్నట్లుగా డప్పు కొట్టుకోవడం సిగ్గుమాలిన విషయం. అందుకే ఆయనకు ధైర్యం ఉంటే ఇప్పుడు చేయించిన సర్వేలో తన పార్టీ సొంతంగా, ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు దక్కుతాయని లెక్క తేలిందో ప్రకటించి... ఆ తర్వాత ఇతర పార్టీల గురించి చిలక జోస్యం చెప్పుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు నవ్వుతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?