వై.ఎస్.జగన్ అంతరంగంలో మీడియా స్థానం

స్వానుభవానికి మించిన గురువు లేడంటారు. జగన్ మోహన్ రెడ్డి స్వానుభవాలు ఆయన ఆలోచనని విపరీతంగా ప్రభావితం చేశాయనిపిస్తోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ, వ్యవహార శైలిలోగాని ప్రమాదానికంచుల్లో పయనిస్తున్నట్టుగా ఆయనని గమనిస్తున్న శ్రేయోభిలాషులకి అనిపిస్తున్నా…

స్వానుభవానికి మించిన గురువు లేడంటారు. జగన్ మోహన్ రెడ్డి స్వానుభవాలు ఆయన ఆలోచనని విపరీతంగా ప్రభావితం చేశాయనిపిస్తోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ, వ్యవహార శైలిలోగాని ప్రమాదానికంచుల్లో పయనిస్తున్నట్టుగా ఆయనని గమనిస్తున్న శ్రేయోభిలాషులకి అనిపిస్తున్నా ఆయన మాత్రం తన స్వానుభవసారంతో ఏర్పరుచుకున్న అభిప్రాయాలతోటే సాగిపోతున్నారనిపిస్తోంది. 

ప్రజాస్వామ్య రాజకీయాల్లో మీడియాది ప్రధాన భూమిక. ఇది ఇప్పటి విషయం కాదు. దశాబ్దాలుగా అందరికీ అనిపిస్తున్న, కనిపిస్తున్న వాస్తవం. తిమ్మిని బమ్మి చెయ్యాలన్నా, లేని దానిని ఉన్నట్టు భ్రమింపజేయాలన్నా రాజకీయ పార్టీలు మీడియాని వాడుకున్నంత ముద్దుగా ఎవ్వరూ వాడుకోరు. ఈ దేశంలో మీడియా సంస్థలుగా గుర్తింపు పొందిన వివిధ ఛానల్స్, పత్రికలు నడుస్తున్నాయంటే అదంతా పార్టీల చలవే. దీనివల్ల ప్రజలకి వాస్తవాల కంటే ఏకపక్ష వార్తలు, అభూత కల్పనలు వినాల్సి వస్తోంది. అయినా ప్రజలు వాటికి అలవాటు పడి చాలా కాలమయ్యింది. కనుకనే తమ భావజాలానికి నచ్చిన పత్రికని, ఛానల్ని పట్టుకుని అందులో వచ్చేదే నిజమని నమ్మి భావప్రాప్తి పొందుతూ బతికేస్తున్నారు. 

అసలు మీడియాని వాడుకోవడమనే దానికి ఆజ్యం పోసిన మహానుభావుడు చంద్రబాబు. అంతకుముందు కొంత వరకు ఉన్నా భారీ స్థాయిలో మీడియాని పోషించిన ఘనత ఆయనదే. 

రామోజీరావుకి కుబేరయోగం పట్టినా, ఆర్కే కోట్లకి పడగలెత్తినా అంతా చంద్రబాబు చలవే అన్నది నిర్వివాదాంశం. 

ఊదరగొట్టి అబద్ధాన్ని శైతం నిజం చేయగల మీడియా ధాటిని ఎదుర్కోవడానికి ఒకే ఒక్క ఆయుధముందని గుర్తించినది వై.ఎస్. రాజశేఖర రెడ్డి. తన వాయిస్ వినిపించుకోవడానికి తనకంటూ సొంత పత్రిక లేకపోయినా, అపోజిషన్ కి కొమ్ము కాసే పత్రికలు ఛానల్స్ ఉన్నా.. 2004లో పాదయాత్ర చేసి జనం మనసు గెలుచుకుని ముఖ్యమంత్రి కుర్చీని కూడా గెలుచుకున్నారు వై.ఎస్. అంటే జనంతో మమేకమయ్యే వాడిని మీడియా శక్తి ఏమీ చెయ్యలేదని నిరూపించినట్టయ్యింది. ఏదో ఒకసారి అలా జరిగుంటుందిలే అనుకుంటే 2009 లో కూడా మళ్లీ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో అది మరో సారి రుజువయ్యింది. అయితే 2008 మార్చిలో సాక్షి పత్రిక వచ్చేసింది. అపోజిజన్ పార్టీని ఎదుర్కోవడానికి సొంత మీడియా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చేసారు వై.ఎస్.ఆర్. అయితే ఎన్నికలకి ఏడాది ముందు మాత్రమే వచ్చిన ఆ పత్రిక మీడియా పరంగా వై.ఎస్ కు పెద్ద శక్తికాలేకపోయింది. మళ్లీ ఆయన జనంతో మమేకమయ్యే గెలిచారు. 

ఆ తర్వాత ఆయన మరణం వల్ల రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి, పర్యవసానంగా రాష్ట్రం రెండుగా విడిపోవడం, 2014లో మోదీ సాయంతో చంద్రబాబు సీయం అవడం జరిగాయి. 

2019 నాటికి సొంత పత్రిక, ఛానల్ చేతుల్లో ఉన్నా కూడా అపోజిషన్ మీడియా ధాటిని తట్టుకోవడానికి జగన్ తన తండ్రిబాటనే పట్టాడు. పాదయాత్రలతో జనంతో మమేకమయ్యాడు. మండుటెండల్లో చెమట్లు కక్కే జనం మధ్య రాసుకు పూసుకుని తిరిగాడు, వాళ్ల పాకల్లో కూర్చుని వాళ్ల చేతులతో కలిపి పెట్టిన పెరుగన్నాలు తిన్నాడు, మీద పడి బుగ్గలు నిమిరినా ఎంగిలి అంటేలా ముద్దులు పెట్టినా చిరాకు పడలేదు. వాళ్ల కష్టాలు విన్నాడు, భరోసా ఇచ్చాడు. అంతే 2019 లో అఖండ విజయం సాధించాడు. 

అంటే ఏమిటి? అవతల మరఫిరంగుల్లాంటి పచ్చ ఛానల్స్ పేలుతున్నా, యాటం బాంబుల్లాంటి పచ్చ పత్రికలు విస్ఫోటనాలు చేస్తున్నా…జగన్ చుట్టూ సరౌండ్ అయ్యి ఉన్న ప్రజల ప్రేమ ఉక్కు కవచంలా కాపాడింది. అది జగన్ కి అనుభవంలోకి వచ్చింది. 

దీనికి తోడు ఏ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను, ఏ ముగ్గురు వైసీపీ ఎంపీలను అయితే చంద్రబాబు 2014-2019 మధ్య మభ్యపెట్టి లాక్కుపోయాడో భగవంతుడు అతనికి ఆ అంకెలే మిగిల్చాడన్నది దైవఘటనగా కనపడింది జగన్ మోహన్ రెడ్డికి. ఈ విషయన్ని పలుసార్లు ప్రస్తావించారు కూడా. 

ఇక అప్పటినుంచి దైవాన్ని, ప్రజల్ని తప్ప ఇక ఎవర్నీ నమ్మని స్థితికి వచ్చేసారు జగన్ మోహన్ రెడ్డి. 

అపోజిషన్ పార్టీ తమ హయాములో సొంత మీడియా సంస్థలకు ఆర్ధిక పరిపుష్టిని ఇచ్చినట్టు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇస్తున్నారని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ అందులో కించిత్ కూడా నిజం లేదు. ఏళ్ల తరబడి తన పంచన నిలబడిన మీడియాలు కదా అని ఎటువంటి ప్రత్యేకమైన వడ్డింపులూ లేవు. దాని వల్ల ఆశించినవాళ్లు తొలుత కాస్త భంగపడినా అది ఆయన తీరు అని తెలిసి స్వాగతిస్తున్నారే కానీ మొహం చాటేయట్లేదు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి పాలనలో పూర్తిస్థాయిలో ప్రజాప్రయోజనధోరణే తప్ప మరొకటి లేదని కనిపిస్తోంది కనుక. అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో..అనే చందాన కూడా ఏమీ జరగట్లేదు. అంతా ఒకటే అన్నట్టుంది. మీడియాని కాపాడుకోవాలి, మీడియా వాళ్లని పోషించుకోవాలి అనే ఆలోచన కంటే చేతిలో ఉన్న డబ్బుతో మరొక కొత్త సన్స్ఖేమ పథకం పెట్టాలని ఆలోచనే ఆయనకొస్తోంది. 

ఒక రకంగా అది స్వాగతించదగిన పరిణామమే. మీడియాకి దొచిపెట్టకుండా ప్రజలకి పంచిపెట్టడం ఆదర్శమే. రానున్న కాలంలో ఈ విప్లవం మిగిలిన పార్టీలకు కూడా పాకితే ఫలితాలు వేరుగా ఉండొచ్చేమో. 

అయితే ఇక్కడే మరొక అంశాన్ని చర్చించుకోవాలి. ఇంతా చెప్పాక ఇప్పుడు చెబుతున్నది కాస్త కాంట్రడిక్షన్ గా అనిపించొచ్చు. అయితే అది కూడా జగన్ మోహన్ రెడ్డి ధోరణలో భాగమే. కనుక చెప్పుకోవాలి. 

మీడియాని పెద్ద సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనపడకపోయినా ఒక పక్క ఐ-పాక్ తో డీల్, మరో పక్క వైకాపా సోషల్ మీడియా వింగ్ పై దృష్టి పెట్టడం, ప్రభుత్వ పథకాల బాకా ఊదడానికి డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు..ఇవన్నీ జరిగాయి. అయితే అక్కడ సమర్థులున్నారా? ఉంటే ఫలితాలెలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. 

వ్యవస్థ అన్నాక కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. వ్యక్తుల మధ్యన వ్యక్తులతో పని కాబట్టి ఇగో క్లాషెస్ ఉంటాయి. ఎవరన్నా ఎవరి మీదైనా ఒక చిన్న అసంతృప్తినో, కంప్లైంటునో జగన్ మోహన్ రెడ్డి వద్దకు మోసుకెళితే వాళ్ల ముందే సదరు వ్యక్తిని పిలిచి చివాట్లు పెట్టడం జగన్ తీరు. దీనివల్ల ఆయా వ్యక్తుల మధ్య వైరం పెరుగుతుంది తప్ప సంఘీభావం ఎందుకుంటుంది? ఇలా హ్యూమన్ రిసోర్సెస్ మ్యానేజ్మెంటులో జగన్ ఫెయిలౌతున్నారని ఒక టాక్. దీనివల్ల కొత్త కంప్లైంటులేవీ జగన్ ను చెరట్లేదు. జరుగుతున్న పొరపాట్లు జగన్ కు తెలియడంలేదు. 

అదలా ఉంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అపోజిషన్ కి వ్యతిరేకంగా వస్తున్న ట్రోలింగులు గట్రా ఎవరి పనితనం? 

శ్రీమతి వై.ఎస్. భారతిని లిక్కర్ కుంభకోణంలోకి లాగితే తిరగబడిన సోషల్ మీడియా యోధుల సారధ్యం ఎవరిది? 

సోషల్ మీడియా వింగుదా? డిజిటల్ కార్పొరేషన్ దా? ఐ పాక్ దా? 

ముగ్గురుదీ కాదు. 

ఏ జీతం తీసుకోకుండా, ఎవరో కూడా తెలియకుండా, ఎక్కడుంటారో కూడా తెలియని కొందరు అభిమానుల పని అంతే. అయితే ఆ క్రెడిట్ ని ఐ-పాక్ నిస్సుగ్గుగా తమ ఖాతాలోకి వేసుకుంటోందని మరొక సమాచారం. 

ఇలా ప్రజల్లో కొందరు యువకులు వైకాపా అభిమానులుండడం వల్ల కాస్త సౌండ్ వినిపిస్తోంది కానీ జగన్ హయాములో పని చేస్తున్న ఏ విభాగమూ చెయ్యాల్సిన పనిని సమర్ధవంతంగా చేయట్లేదు. 

2019 ఎన్నికలకి ముందు తన గెలుపుకి సాయపడ్డారనుకున్న చాలామందికి సలహాదారులుగా నియమించారు జగన్. కానీ ఇందాక చెప్పుకున్నట్టు ఏ జీతమూ ఆశించకుండా 2019 ఎన్నికల సమయంలో పోరాడిన అనామక సోషల్ మీడియా సేన చాలామందున్నారు. వారిలో కొందరు తమపేర్లతో సహా వైకాపాలోని ఉన్నతశ్రేణులకి తెలుసు. వాళ్లు అపోజిషన్ పెట్టిన కేసుల్లో ఇరుక్కుంటే ఒక్కళ్లు సంఘీభావం తెలుపలేదు. వారిలో ఒకరిద్దరు ఆ మధ్య తిరుమల ప్రత్యేక దర్శనానికి ప్రయత్నించబోతే ఎవ్వరూ పట్టించుకోలేదు. “మా జగనన్న కోసం పోరాడాం. ఆయన సీయం అయ్యాడు” అనుకున్న వారికి ఎటువంటి చిన్న ప్రయోజనం కూడా జరగలేదు. అసలు ఈ బ్యాచ్ ఉన్నారని జగన్ దృష్టికి చేర్చిన వాళ్లు లేనే లేరు. వీళ్ళని పైదాకా తీసుకెళ్లి పెద్దవాళ్లని చేయడమెందుకని అనుకుంటున్నారు ఆయా విభాగాల్లో ఇంచార్జులుగా ఉంటున్న పలువురు. 

మరి ఈ సోషల్ మీడియా యోధులంతా 2024 ఎన్నికల ముందు సౌండ్ చేస్తారా? కష్టమే. వరాలివ్వని దేవుడికి, కనీసం చూపు కూడా సారించని దేవుడికి ఎందుకు మొక్కుతారు? 

ఏ వరమూ ఇవ్వకపోయినా పర్వాలేదు…నీకు కొమ్ముకాయడానికే మేము పుట్టాము అనే వాళ్లు ఎంతమందుంటారు? చూడాలి! 

ఇక్కడ చెప్పేది ఒక్కటే. ఇదే ధోరణిలో కొనసాగుతూ “ప్రజలు-దైవం” అనే కాన్సెప్టుతో మాత్రమే 2024 ఎన్నికల్లో ముందుకెళితే జగన్ మోహన్ రెడ్డికి మళ్లీ మునుపటి విజయం వస్తుందా అనేది చూడాలి. ఫలితమేదైనా ఆయన స్వానుభవమే ఆ తర్వాత ఆయనకి మార్గనిర్దేశం చెయ్యాలి. అంతే తప్ప ఎవరు చెప్పినా వారు వినరు. 

శ్రీనివాసమూర్తి