మనం ఏదైనా ఎవరికైనా ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే.. ఆ తర్వాత వాళ్లు ఎదురైనప్పుడు ఎప్పటిలాగా ఫేస్ చేయలేం. చెప్పింది చేయలేకపోయాం అన్న చిన్న సిగ్గు, అపరాధభావం, మన వైఫల్యం లేదా చేతకానితనం లేదా నిర్లక్ష్యం పట్ల మనకే ఒక అవమానం లాంటి ఫీలింగ్ మనల్ని ఇబ్బంది పెడతాయి. కానీ ఏపీ బిజెపి సారథి సోము వీర్రాజుకు అలాంటి అవమానం లేదా సిగ్గు లాంటి ఫీలింగ్ ఏమాత్రం ఉన్నట్టు లేదు. మూడు రాజధానుల విషయంలో తగుదునమ్మా అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలను గమనిస్తే ఇలాంటి అనుమానమే కలుగుతుంది.
ఇంతకూ సోము వీర్రాజు ఏం అంటున్నారో తెలుసా.. మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ కాలక్షేపం చేస్తున్నారట. విశాఖనుంచి పాలన సాగిస్తామంటున్న వైసీపీ అసలు ఈ మూడేళ్లలో విశాఖ నగరంలో ఏం అభివృద్ధి చేపట్టింది అంటూ సదరు సోము వీర్రాజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మేం కేంద్ర ప్రాజెక్టులు ఇస్తాం అంటే కూడా వీరి వాటా కూడా ఇవ్వడం లేదు అంటూ పాచిపాటలు పాడుతున్నారు.
అయితే ఇక్కడ కొన్ని వాస్తవాల్ని గమనించాల్సి ఉంది. జగన్ మూడేళ్లుగా ఏం చేశారు? అనే ముందు.. ఈ ప్రభుత్వాన్ని ఆ దిశగా ఏం పనిచేయనిచ్చారు? అనే ప్రశ్న కూడా మనకు కలుగుతుంది. జగన్ మూడు రాజధానులను ప్రకటించిన నాటినుంచి.. కోర్టు కేసుల రూపేణా రకరకాల చికాకులు సృష్టిస్తూనే ఉన్నారు. రాజధాని కోసం కాదు మొర్రో అంటూ కొన్ని నిర్మాణాలు చేపట్టినా కూడా.. వాటిని కూడా కోర్టు కేసులద్వారా ఆపు చేయించిన ఘనత విపక్షాలది.
ఇక ఏం చేయాలి ప్రభుత్వం అక్కడ. అయితే మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజు.. విశాఖకు రాజధానిగా ప్రకటించిన తర్వాత.. అక్కడ ఏమీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించడంలోని ట్విస్టు ఏమిటో మనకు అర్థం కాదు.
అయినా విశాఖ గురించి ఇంతగా ఆవేదన చెందుతున్న సోము వీర్రాజు గారు.. అమరావతి ఏకైక రాజధానికి మాత్రమే మా మద్దతు అని పదేపదే చెబుతున్నారు కదా. దీనికోసం కేంద్రం తరఫున వాళ్లు ఏం చేశారో చెప్పే దమ్ముందా? చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లిన తమ పార్టీ ప్రధాని లేదా కేంద్ర ప్రభుత్వం అమరావతికి రాజధానికి మద్దతు తప్ప.. నిధుల రూపేణా ఏం సహకరించిందో చెప్పాలని ప్రజలు అడిగితే సోము వీర్రాజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? తాము చేయాల్సిన పని చేయకుండా.. విశాఖకు జగన్ ఏమీ చేయలేదనే ప్రగల్భాల మాటలు వారికెందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.