సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గమ్మత్తైన సవాల్ చేస్తున్నారు. అర్జంటుగా వైసీపీ సర్కార్ పెద్దలు అసెంబ్లీని రద్దు చేయాలట. జనంలోకి వచ్చి ఎన్నికలలో మూడు రాజధానుల మీద తాడో పేడో తేల్చుకోవాలిట. ఎందుకంటే ఏపీ జనాలు అంతా అమరావతి ఏకైక రాజధాని అన్న దానికే కట్టుబడి ఉన్నారుట.
ఇంత ధీమాగా ఉన్న మాజీ మంత్రి గారు తమ పార్టీ అధినేతకే చెప్పి విశాఖలో ఉన్న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించవచ్చు కదా అని వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. మరీ అంత సరదాగా ఉంటే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆయన టెక్కలి సీటుకు రాజీనామా చేసి తిరిగి గెలిచి ఇదిగో అమరావతికే జై అంటున్న జనం అని గట్టిగా చెప్పవచ్చు కదా అని వైసీపీ నేతలు సలహా ఇస్తున్నారు.
మూడు రాజధానులు అన్నది చెల్లని వ్యవహారం అని అయ్యన్న చెబుతున్నారు. సుప్రీం కోర్టులో కూడా అమరావతి రైతులకే న్యాయం జరుగుతుందని, అంతా అనుకూలంగా తీర్పు వస్తుందని కడు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి అన్నీ తమకే పాజిటివ్ గా ఉంటుందని ధీమా ఉన్నపుడు ఈ కోపాల్ తాపాల్ ఏల అయ్యన్నా అని అడుగుతున్నారు.
సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే టీడీపీ నేతలకు ఎందుకు అంత ఉలికిపాటు అన్నదే అధికార పార్టీల సూటి ప్రశ్న.