సరైన సమయంలో కేసీఆర్ రాజకీయ వ్యూహం

రాజకీయ నాయకులు ఏ పని చేసినా సమయానుకూలంగా చేస్తారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారు. వారు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో తెలంగాణా సీఎం కేసీఆర్ దిట్ట.…

రాజకీయ నాయకులు ఏ పని చేసినా సమయానుకూలంగా చేస్తారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారు. వారు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో తెలంగాణా సీఎం కేసీఆర్ దిట్ట. చాలాసార్లు బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు ప్రత్యర్థులను ఉద్దేశించి కేసీఆర్ తో పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. కేసీఆర్ దాదాపు ప్రతి విషయాన్ని ఏదో ఒక సెంటిమెంటుతో ముడిపెట్టి ప్రత్యర్థులను ఇరుకున పెడతారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యూహమే పన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా చెప్పాలంటే ప్రధాని మోడీని దెబ్బ తీయాలన్నదే కేసీఆర్ పన్నాగం.

హైదరాబాదులో నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ ను ప్రారంభించిన కేసీఆర్ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారం రోజుల్లోగా జీవో జారీ చేస్తామని ప్రకటించారు. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రాన్ని అదిఅడిగి విసిగిపోయామని, అందుకే జీవో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రిజర్వేషన్లను ఆమోదించి గౌరవం కాపాడుకుంటారా? లేకపోతే ఉరితాడుగా మార్చుకుంటారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అంటే బాల్ కేంద్రం కోర్టులోకి  విసిరారు. కేంద్రం ఆమోదించకపోతే గిరిజనులకు కేంద్రం ప్రధానంగా మోడీ వ్యతిరేకమని ప్రచారం చేస్తారు. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కూడా ఇరుకున పడతారు.

కేసీఆర్ ఇప్పుడే ఈ ప్రకటన చేయడానికి కారణమేమిటంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తోంది కదా. అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఒకేవేళ కేంద్ర రిజర్వేషన్లకు ఆమోదించినా ఆ క్రెడిట్ కూడా తానే కొట్టేస్తారు. పది శాతానికి పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 62 శాతానికి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది. బిల్లుతో సంబంధం లేకుండా గిరిజన రిజర్వేషన్లను పెంచాలని గతంలో భావించిన ప్రభుత్వం… తాజాగా అమలు దిశగా ముందుకెళ్తోంది. వాస్తవానికి రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది.

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులతోపాటు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది.  ముస్లిం మైనార్టీలకు పన్నెండు  శాతం, గిరిజనులను పది శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ ఈ బిల్లు రూపొందించారు. బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లిం మైనార్టీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను 12  శాతానికి, గిరిజనులకు అమలు అవుతున్న 6  శాతం రిజర్వేషన్లను 10శాతానికి పెంచారు. ఆ బిల్లు ప్రకారం రాష్ట్రంలో బలహీన వర్గాలకు 37శాతం రిజర్వేషన్లు ఉంటాయి. A గ్రూప్ వారికి 7శాతం, Bగ్రూప్‌లో 10శాతం, Cగ్రూప్ కింద 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. D గ్రూప్‌లో 7శాతం, E గ్రూప్‌లో 12శాతం రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు ఉన్న 15శాతం రిజర్వేషన్లు ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా ఉంటాయి.

మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని 50నుంచి 62కు పెంచుతూ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం కూడా పొందింది. 2017 ఏప్రిల్ 16వ తేదీన రిజర్వేషన్ల పెంపు బిల్లు శాసనసభ, మండలిలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. రిజర్వేషన్ల శాతం 50 శాతాన్ని దాటుతుండడంతో తమిళనాడు తరహాలో బిల్లును తొమ్మిదో షెడ్యూలులో  చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ రిజర్వేషన్ల పెంపు విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ఆటంకాలు లేవని… రాజ్యాంగపరంగా ఇబ్బందులు ఉండబోవని వివరించారు.కానీ  గడచిన నాలుగేళ్లుగా ఆ బిల్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉంది. గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్రం నిర్ణయం ఆలస్యం చేయడంతో… బిల్లుతో సంబంధం లేకుండా కోటా పెంపు విషయమై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. 

ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసిన చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు విషయమై ఆలోచన చేసింది. గిరిజన ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న గిరిజన రిజర్వేషన్ల విధానాలను కూడా అధ్యయనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచిన తరహాలో ఉత్తర్వులు జారీ చేయాలన్న అంశంపై కసరత్తు చేశారు. అందుకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయా… ఎదురైతే ఏం చేయాలన్న విషయమై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే వివిధ కారణాల రీత్యా అప్పట్లో అది ముందుకు సాగలేదు.

తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. కేంద్రం వద్ద ఉన్న బిల్లుతో సంబంధం లేకుండా ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచాలని నిర్ణయించిన సీఎం… వారం రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ తో  కలుపుకొని రాష్ట్రంలో ప్రస్తుతం 60శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచితే రిజర్వేషన్ల మొత్తం 64 శాతానికి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏం చేస్తుందన్నది చూడాలి. 

కేసీఆర్ సరైన సమయం చూసి కేంద్రాన్ని ఇరుకున పెట్టారు. నిజానికి గత నాలుగేళ్లుగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారో లేదో తెలియదు. అవసరమైనప్పుడు ఈ అస్త్రాన్ని బయటకు తీద్దామని అట్టిపెట్టుకున్నరోమో.