జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తన విషయం కంటే ఇతరుల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్‌ను గుర్తు చేసుకోకుండా ఒక్క క్షణం కూడా గడిపేలా లేరనే విమర్శలు వస్తున్నాయి. మీటింగ్ ఏదైనా జగన్‌పై విమర్శలు చేయడమే పవన్‌కల్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ఆయన తేల్చేశారు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఆయన ప్రకటించారు. జనసేన లీగల్‌సెల్ సమావేశంలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీకి 45 నుంచి 67 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఓ సర్వే చెప్పిందన్నారు.
ఇదే సందర్భంలో సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించే వుంటే బాగుండేదని ఆయన అన్నారు. ఈ సారి అసెంబ్లీలో జనసేన జెండా ఎగరాలని అన్నారు. అయితే తన పార్టీ ఎన్నిసీట్లలో పోటీ చేస్తుంది? ఎన్నింటిలో గెలుస్తుందని మాత్రం పవన్‌కల్యాణ్ చెప్పకపోవడం గమనార్హం. ఎంతసేపూ జగన్ ప్రభుత్వం దిగిపోతుందనే మాట తప్ప, జనసేన భవిష్యత్ ఎలా వుంటుందో ఆయన చెప్పలేకపోతున్నారు.
వైసీపీని ఓడిస్తే సమాజంలో మార్పు వస్తుందన్న రీతిలో ఆయన ప్రసంగం ఉంది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్‌కల్యాణ్ ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు. అప్పుడు వైసీపీకి 67 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్య పవన్ చెబుతున్నారు. మరి మిగిలిన సీట్లలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ఎన్నెన్ని వస్తాయో పవన్ చెప్పకపోవడం వెనుక కారణం ఏంటనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. 10 అసెంబ్లీ సీట్లతో పవన్ సరిపెట్టుకుని టీడీపీకి ప్రచారం చేస్తారనే ప్రచారం బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కనీసం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్ని చోట్ల తన పార్టీ పోటీ చేస్తుందో చెప్పలేని పవన్‌కల్యాణ్ కూడా పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు.
వైఎస్ జగన్‌ను ఓడిస్తే తన జీవితాశయం నెరవేరుతుందన్న తపన, అక్కసు పవన్‌కల్యాణ్ ప్రసంగంలో కనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీ అధినేతగా తాను అధికారంలోకి వస్తామని చెప్పని ఏకైక నాయకుడు బహుశా పవన్‌కల్యాణ్ ఒక్కడే అయి వుంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి ధోరణే పవన్‌ను రోజురోజుకూ పతనం చేస్తోందంటే… కాదనగలరా?