రానున్న కాలంలో వైసీపీ, టీడీపీలను వాష్ అవుట్ చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు హెచ్చరిక చేశారు. ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పార్టీలను ఏ విధంగా వాష్ అవుట్ చేశామో, ఏపీలో కూడా టీడీపీ, వైసీపీలను వాష్ అవుట్ చేస్తామని హెచ్చరించడం విశేషం. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుడడం వల్లే ఆ పార్టీల ఊసే లేకుండా చేస్తామన్నారు.
రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీ కలిసి వాష్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో గనులు, ఇసుక దోచుకుంటున్నారన్నారు. అలాగే మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజావ్యతిరేక కార్యకలాపాలు చేస్తుండడం వల్లే వాష్ అవుట్ చేస్తామని హెచ్చరిస్తున్నట్టు వీర్రాజు చెప్పారు. రాజధాని అంటూ గత మూడేళ్లలో వైజాగ్‌కు ఏం చేశావని జగన్‌ను వీర్రాజు ప్రశ్నించారు.
వైజాగ్‌కు తాము ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. వైజాగ్‌లో ప్రతి వీధిలో మోదీ మార్క్ అభివృద్ధి చేశామన్నారు. ఏపీ అభివృద్ధి గురించి తాము ఆలోచిస్తుంటే, మరోవైపు టీడీపీ, వైసీపీ మాత్రం ప్రజలతోనూ, కొన్ని పక్షాలతోనూ సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు. తాము కూడా సర్జికల్ సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడతామని హెచ్చరించారు. తమది నిర్మాణాత్మక సైకలాజికల్ మైండ్‌గేమ్‌గా ఆయన చెప్పుకొచ్చారు.
తమ సర్జికల్స్ ఏంటంటే 50 లక్షల మంది రైతులు, 90 లక్షల మందికి రెండు పూటలా బియ్యం ఇవ్వడం, లక్షలాది మందికి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, లక్షలాది మందికి పౌష్టికాహారం ఇవ్వడం తదితర అభివృద్ధి, సంక్షేమ అంశాలుగా చెప్పుకొచ్చారు. ఇలా సరదాతో కూడిన సీరియస్ అంశాల్ని వీర్రాజు తనదైన స్టైల్‌లో చెప్పడం విశేషం.