ఉర్దూలో ఊపర్ షేర్వానీ …అందర్ పరేషానీ అని ఒక సామెత ఉంది. దీన్ని తెలుగులో పైన పటారం …లోన లొటారం అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉందని ఆ పార్టీ కేంద్ర నాయకులు అభిప్రాయపడుతున్నారట. మామూలుగా రోజూ మీడియాని వాచ్ చేసేవాళ్లకు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కంటే చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి, సామర్ధ్యం కమలం పార్టీకే ఉన్నాయనిపిస్తోంది. సీఎం కేసీఆర్ కూడా బీజేపీనే తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. దాన్నే టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికే మునుగోడు ఉప ఎన్నికను తెచ్చిపెట్టింది బీజేపీ.
మా పార్టీ బలం అంత …ఇంత అంటూ బీజేపీ నాయకులు తెగ హడావుడి చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదే అంటూ పది బల్లలు గుద్ది చెబుతున్నారు. కానీ ఇదంతా ఒట్టి హడావుడేనని బీజీపీ అగ్ర నాయకులు కమ్ కేంద్ర నాయకులు అభిప్రాయపడుతున్నారు. నాయకులంతా అంటే అందరూ అని కాదు. ప్రధాని మోడీకి కుడి భుజమైన, కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి అయిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయపడటమే కాదు, రాష్ట్ర బీజేపీ నాయకులకు క్లాసు తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ బలోపేతం కావాలంటే వలసల మీదనే ఆధారపడింది.
రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి కాషాయంలోకి జంపింగ్ లు లేవని అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారట. జాతీయ నాయకత్వం అంచనాలకు అనుగుణంగా పని చేయలేకపోతున్నారని.. లక్ష్యాలను అందులేకపోతున్నారన్నంటూ బాద్ షా క్లాస్ పీకారని అంటున్నారు. పార్టీలో సమన్వయం లోపించిందని.. కొందరు నేతలు సరిగా పని చేయడం లేదని మండిపడ్డారని సమాచారం. కేసీఆర్ పాలనపై గుర్రుగా ఉన్న జనాలు బీజేపీ పట్ల ఆసక్తిగా ఉన్నా.. నేతలు సరిగా పనిచేయడం లేదని అన్నారట. బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని, మిగతా నేతలు కూడా మరింతగా కష్టపడాలని సూచించారట. కష్టపడితేనే ఫలితం ఉంటుందని.. అలాంటి నేతలకే పార్టీలో మంచి అవకాశాలు వస్తాయని అమిత్ షా తేల్చి చెప్పారట.
కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ జనాల్లోకి వెళ్లాలని ఆదేశించారని సమాచారం. మునుగోడులో ప్రచారం పెంచాలని సూచించిన అమిత్ షా.. పార్టీ తరపున కమిటీని నియమించాలని ఆదేశించారట. మునుగోడులో గెలిచి తీరాలని చెప్పిన అమిత్ షా.. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారట. మునుగోడులో సర్వే చేయించిన బీజేపీ హైకమాండ్.. పార్టీ పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో ఉప ఎన్నికను మరింత ఆలస్యం చేయవచ్చనే వాదనలు కూడా కొన్ని వర్గాల నుంచి వస్తుండటంతో మునుగోడు బైపోల్ పై గందరగోళం నెలకొంది. మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే వాతావరణం లేదని అమిత్ షా అభిప్రాయపడినట్లు సమాచారం.
కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి లాక్కునే ఉద్దేశ్యంతో ఆయనతో రాజీనామ చేయించారు. తర్వాత బీజేపీలోకి చేర్చుకుని టికెట్ ప్రకటించారు. అప్పట్లో బీజేపీ నేతల ఉద్దేశ్యం ఏమిటంటే ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించటం, నామినేషన్ వేయటమే ఆలస్యం రాజగోపాలరెడ్డి గెలిచినట్లే అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ చూస్తుంటే మాజీ ఎంఎల్ఏ గెలుపు అనుమానమే అని తేలిందట. దీనికి కారణం ఏమిటంటే రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరినా ఆయన క్యాడర్లో చాలామంది కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. బీజేపీలో తాను చేరితే తన క్యాడర్ మొత్తం బీజేపీలోకి వచ్చేస్తుందని కోమటిరెడ్డి అమిత్ షా కు చెప్పారట.
తీరాచూస్తే ఎవరో కొంతమంది తప్ప మిగిలిన నేతలంతా బీజేపీలో చేరేదిలేదని చెప్పేశారట. ఎంత ప్రయత్నిస్తున్నా నేతలు మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతామని చెబుతున్నారట. ఉపఎన్నికలో త్రిముఖ పోటీ జరిగితే బీజేపీ అభ్యర్ధి గెలుపు అనుమానమే అంటున్నారు. ఇపుడు మునుగోడులో కూడా బీజేపీ గెలుపు అనుమానంగా మారింది. వలసలను ప్రోత్సహించటంలో బీజేపీ నేతలంతా ఫెయిలయ్యారని అమిత్ మండిపడ్డారట. కేవలం వలసలను ప్రోత్సహించటం కోసం ప్రతి గ్రామంలోను త్రిసభ కమిటీలను వేయమని ఆదేశించారట. షెడ్యూల్ వచ్చేలోగా ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి చేర్చాల్సిందే అని చెప్పారు. మరి రాష్ట్ర నాయకులు ఈ లక్ష్యాన్ని సాధిస్తారా?