జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇవాళ విజయవాడలో ఆయన పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గెలిచే వారికే సీట్లు ఇస్తామన్నారు. వైసీపీపై రోజురోజుకూ ఆదరణ తగ్గుతోందన్నారు. ఇదే సందర్భంలో జనసేనపై ప్రజాదరణ పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీకి కేవలం 45 నుంచి 67 లోపు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పారు. బస్సు యాత్రను వాయిదా వేసి వచ్చే నెల నుంచి పూర్తిగా నియోజకవర్గాల సమీక్ష చేస్తానన్నారు. మొదట విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి సమీక్ష మొదలు పెడతానన్నారు. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే.
రానున్న ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారో పవన్‌కే స్పష్టత లేదు. గెలుపునకు ఢోకా లేని నియోజకవర్గం ఏదో వెతికే పనిలో జనసేన వుంది. పవన్‌కల్యాణ్ గెలుపునకే దిక్కులేదని, అలాంటిది ఆయన గెలిచే వారికే సీట్లు ఇస్తానని చెప్పడం ఏంటంటూ సోషల్ మీడియాలో జనసేనానిపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. పార్టీ పెడితే సరిపోదని, గెలిచే సత్తా వుండాలని, అధినాయకుడి గెలుపుపైనే జనసేన శ్రేణులకి నమ్మకం లేదంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేయడం గమనార్హం.
మొదట తనకు సీటు కేటాయించుకుని, మిగిలిన వాటి గురించి ఆలోచిస్తే పవన్‌కు పరువు దక్కుతుందనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ పెట్టుకుని, చంద్రబాబు పల్లకీ మోయాలనుకున్న నాయకుడిని జనం ఎలా ఆదరిస్తారు? ఎందుకు అక్కున చేర్చుకుంటారనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి. గెలిచే వారికే సీట్లు అని పవన్ చెప్పడం… అతిపెద్ద జోక్ అని నెటిజన్లు వెటకరిస్తున్నారు.