తెలంగాణ రాజకీయంలో ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాత్ర విచిత్రమైనవి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన సోదరుడు ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. వెంకట్ రెడ్డి మాత్రం అధికారికంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. అలాగని కాంగ్రెస్ పార్టీపై పూర్తి విధేయతతో కాదు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై వెంకట్ రెడ్డికి తీవ్రమైన అసహనం ఉంది. ఆ అసహనాన్ని బాహాటంగానే చాటడానికి వెనుకాడటం లేదు.
ఇదంతా చూస్తే మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం సహకరిస్తారనుకోవడం భ్రమే అవుతుంది. కోమటిరెడ్డి సోదరుల మధ్య సఖ్యత ఎక్కడా చెడింది లేదు. ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. అలాంటప్పుడు సోదరుడి ఓటమి కోసం వెంకట్ రెడ్డి ఎక్కడా మనస్ఫూర్తిగా పని చేయలేకపోవచ్చు. అయితే తను అధికారికంగా కాంగ్రెస్సే కాబట్టి. . తన ప్రాంతంలోని ఉప ఎన్నిక ఎన్నిక కాబట్టి.. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అయితే పని చేస్తూ ఉన్నారు. మరి వెంకట్ రెడ్డి ఏ మేరకు పార్టీని గట్టెక్కించగలరనేది శేష ప్రశ్న!
ఉప ఎన్నికలను వెంకట్ రెడ్డి అస్సలు పట్టించుకోవడంలేదని, నియోజకవర్గం వైపు రావడం లేదనే టాక్ కొంత వినిపించింది. అయితే ఆయన కదిలారు. పార్టీ తరఫున యాక్టివ్ గా ఉంటున్నట్టుగా కనిపిస్తున్నారు.
అభ్యర్థిత్వం విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాస్త పై చేయి సాధించారని టాక్. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఖరారు కావడం వెనుక వెంకట్ రెడ్డి ప్రభావం కూడా ఉందట. ఇక్కడ నుంచి మరొకరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దింపాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఆర్థికంగా బలవంతుడైన ఒక వ్యక్తిని కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపాలని రేవంత్ ప్రయత్నించగా.. స్రవంతి అభ్యర్థిత్వంపై ఏఐసీసీ ప్రకటన రావడం వెనుక వెంకట్ రెడ్డి వ్యూహ చతురత కూడా ఉందట. మరి స్రవంతి అయితే తన సోదరుడికి ఈజీ అవుతుందని ఆయన అనుకున్నారో లేక రేవంత్ ఎడ్డెమంటే తెడ్డెమనే లెక్కలతో వ్యవహరించారో కానీ పాల్వాయి స్రవంతి కి అభ్యర్థిత్వం ఖరారు కావడం వెనుక వెంకట్ రెడ్డి ఉన్నారట.
ఏదేమైనా.. పార్టీ కోసం పని చేసినట్టుగా పైకి అయినా కనిపించాలన్నట్టుగా వెంకట్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపునే కనిపిస్తున్నారు. మరి అంతర్గత లెక్కలెలా ఉన్నాయో!