మూడు రాజధానుల గురించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదంటూ, అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ సర్కారు కోరుతోంది.
అయితే, ఈ పిటిషన్ విచారణలో తాము కూడా ఇంప్లీడ్ కావాలని అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న రైతులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ లో తాము కూడా ఇంప్లీడ్ కావడానికి, స్టే ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని కోరడానికి గల న్యాయపరమైన అవకాశాలను వారు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నిజానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని శాసనసభలో ఉపసంహరించుకున్న తర్వాత.. మరింత పటిష్టమైన బిల్లును తీసుకువస్తాం అని చెప్పింది. కానీ.. కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశం ఉండని విధంగా పటిష్టమైన మరో బిల్లు తెస్తుందని అంతా అనుకున్నారు. అయితే, ఆరునెలల వ్యవధి తర్వాత ఇప్పుడు వారు హైకోర్టు తీర్పుపై స్టే కోసం సుప్రీంను ఆశ్రయించారు.
ఈ పిటిషన్ తేలేవరకు విశాఖకు రాజధాని తరలింపు అనేది జరిగే అవకాశమూ లేదు. దీంతో దసరా నాటికెల్లా విశాఖ నుంచే పరిపాలన అంటూ మంత్రులు చెప్పిన మాటలన్నీ ఉత్తివే అని తేలిపోయాయి. ఈ పిటిషన్ సత్వరమే ఒక కొలిక్కి వచ్చే అవకాశమూ తక్కువ. జగన్ సర్కారు పదవీకాలం ముగిసేలోగా కేసు తేలుతుందా లేదా అనేది అనుమానమే. ఒకవేళ ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా తీర్పు వస్తేగనుక తక్షణం ఎడ్మినిస్ట్రేటివ్ రాజధానిని విశాఖకు తరలించడం తథ్యం.
అయితే తీర్పు వచ్చే 2024 ఎన్నికల వరకు రాకుండా ఉండాలన్నదే అమరావతి రైతుల కోరిక కూడా. అందుకని ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అయితే.. వాదనలు వినిపించడం ద్వారా విచారణ ప్రక్రియను ఆలస్యం చేయడానికి అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికలు వస్తే.. మూడురాజధానులకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు ఉంటుందనేది వారి ఆశ. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది వారి ఆశ.
తెరవెనుక జరగగల పరిణామాలను పరిశీలించినప్పుడు.. 2024 ఎన్నికల్లో కీలక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా వనరులను కూడా సమకూర్చి ఎన్నికల్లో నెగ్గించడానికి అమరావతి రైతులు సిద్ధంగానే ఉంటారు. టీడీపీని తాము అధికారంలోకి తెచ్చేయగలమని, అందుకే అప్పటిదాకా కేసు తేలకుండా ఆపాలనే కోరికతో వారు ఈ సుప్రీం పిటిషన్ లో ఇంప్లీడ్ కావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడానికి న్యాయపరంగా వీలవుతుందో లేదో తెలుసుకునేందుకు నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.