Advertisement

Advertisement


Home > Politics - Analysis

సమర్థత మీకే సొంతమా?

సమర్థత మీకే సొంతమా?

ఘనత వహించిన సీనియర్ జ‌ర్నలిస్ట్ ఆర్కే ఈవారం జ‌గన్ సమర్థత గురించి వెరైటీగా రాయాలని చూసారు. ఓవర్ నైట్ ఎదిగిపోగల సమర్థత వున్న జ‌గన్ అమరావతి కట్టలేరా? ఆయనకు ఆ సమర్థత లేదా అన్నట్లుగా నిందా స్తుతి టైపులో వండి వార్చారు. నిజానికి జ‌గన్ తనకు సమర్థత లేదనే చెప్పారు. చంద్రబాబు మాదిరిగా విడిపోయి దుస్థితిలో వున్న ఈ రాష్ట్రానికి తానే దిక్కు అని చెప్పలేదు. తన అనుకూల మీడియాతో 2014లో మాదిరిగా డప్పేయలేదు. ఆనాడు అనుభవం అనే ప్రచారాస్త్రం తోనే కదా చంద్రబాబును గెలిపించింది.

ఇలాంటి నిందా స్తుతి లు రాయాలంటే చాలా మంది మీద చాలా రాయొచ్చు. కానీ నిజం చెప్పాలంటే జ‌గన్ కన్నా ఎంతో మంది తమ సమర్థతను బిజినెస్ పరంగా ఎదగడంలో ఎప్పుడో చూపించారు. వారందరినీ తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంతెందుకు తెలుగునాట వేలాది మంది జ‌ర్నలిస్ట్ లు వున్నారు. వీళ్లలో ఓ భారీ పత్రిక చానెల్ యజ‌మాని కాగలిగింది ఎంత మంది? ఒక చేతి వేళ్ల మీద అయినా లెక్కించగలమా?

2000 లో అప్పటి ప్రభుత్వం చెప్పినా ఎవ్వరూ తీసుకోని ఆంధ్ర‌జ్యోతిని ఆర్కే ఎలా తీసుకోగలిగారు. కోట్ల విలువైన భవనాలు అన్నీ అప్పట్లో ఒక్కసారిగా ఆర్కే ఏ విధంగా, ఏ విధమైన అగ్రిమెంట్ తో దఖలు పడ్డాయి అన్నది క్లారిటీ ఇవ్వగలరా? లీజు కు అయితే ఎంత మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చారు. ఎలా ఇచ్చారు అన్నవి వివరించగలరా? అయినా అదంతా మనకు అనవసరం. అది ఆయన సమర్థత. దాంతోనే ఓ సాదా సీదా జ‌ర్నలిస్ట్ అంచెలంచెలుగా ఎదిగారు. కోటానుకోట్లకు అధిపతి అయ్యారు.

అంతెందుకు ఈనాడు స్థాపించక ముందు రామోజీ ఏమిటి? కొన్ని చిన్న సంస్థలకు అధినేత. విశాఖలో లీజుకు బిల్డింగ్ తీసుకున్న వ్యక్తి. ఈ రోజు వేలాది లేదా లక్షలాది కోట్లకు అధిపతి. అంటే ఆయనకు ఎంత సమర్థత వుండి వుండాలి.

సరే, రామోజీ అంటే ఓ స్థాయి నుంచి మరో స్థాయికి చేరారు. గంటా శ్రీనివాసరావు అనే మాజీ మంత్రి వర్యుల ప్రారంభం ఏమిటి? విశాఖలో ఓ మీడియా సంస్థలో నెలకు వెయ్యి రూపాయల కన్నా తక్కువ జీతానికి పని చేసారు. మరి అలాంటి వ్యక్తి రేంజ్ ఇప్పుడు ఏమిటి? అంటే సమర్థతే కదా?

గద్దె బాబూరావు అనే నాయకుడు ఉత్తరాంధ్రకు వలస వచ్చారు. అప్పటి కాంగ్రెస్ నాయకుల అండ సంపాదించి, బస్ పర్మిట్లు తోడు చేసుకుని ఎన్టీఆర్ చలువతో ఎమ్మెల్యేగా మారి ఈ రోజు ఏ రేంజ్ కు చేరారు.

సమర్తత అన్నది కేవలం జ‌గన్ స్వంతం కాదు. యనమల రామకృష్ణుడు తొలిసారి ఎమ్మెల్యే అయినపుడు లెవెల్ ఏమిటి? కింజ‌రాపు యర్రం నాయుడు తొలిసారి ఎమ్మెల్యే అయినపుడు ఏ మేరకు ఆస్తులు వుండి వుంటాయి? ఆ తరువాత వారు ఏ రేంజ్ కు ఎదిగారు..అంటే వారి సమర్తతే కదా?

అక్కడికి జ‌గన్ మాత్రమే తండ్రిని అడ్డం పెట్టుకుని రాత్రికి రాత్రి ఎదిగిపోయారనే సమర్థత కలిగి వున్నారని అంటున్నారు ఆర్కే. ఆ లెక్కన చంద్రబాబు కన్నా సమర్థుడా జ‌గన్? రెండు ఎకరాల ఆసామీ చంద్రబాబు తండ్రి అని అందరూ అంటారు. మరి ఈ రోజు వేల కోట్ల ఆస్తి చంద్రబాబు స్వంతం. తిరుపతిలో విష్ణుప్రియ హోటల్ కు రుణం సాధించిన వేళ ఎన్టీఆర్ టైమ్ లో ఎంత రగడ జ‌రిగింది. మరి అలా ఓ చిన్న హోటల్ కు రుణం కోసం కిందా మీదా అయిన చంద్రబాబు ఈ రోజు ఏమిటి? మరి ఇదంతా సమర్థత కాదా?

పేర్లు తీయడం అనవసరం కానీ, ఇటు హైదరాబాద్ కో, కర్ణాటకకో, అటు విశాఖకో కృష్ణా డెల్టా నుంచి కట్టుబట్టలతో వలస వెళ్లి ఎన్టీఆర్ ప్రభుత్వం అండదండలతో ఎదిగి కోట్లకు పడగలెత్తిన వారి జాబితా తీస్తే చాంతాడంత వుంటుంది. వీళ్లంతా సమర్తులే కదా?

చాలా అంటే చాలా మంది రాజ‌కీయ నాయకుల మూలాలు తీస్తే అక్కౌంటెట్లు, డిటిపి ఆపరేటర్లు, టాక్సీ డైవ‌ర్లుగా కనిపిస్తారు. వాళ్లంతా ఇవ్వాళ కోట్లకు పడగలెత్తారు. ఇదంతా సమర్థతే కదా? అక్కడికి జ‌గన్ అవినీతితో అడ్డంగా రాత్రికి రాత్రికి ఎదిగాడు అని నిరూపించడానికి ఈ నిందా స్తుతి అనే దారి తొక్కడం ఆర్కే కే చెల్లు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?