లోకేశ్ పాద‌యాత్ర‌…టీడీపీ ఏ తీరానికి?

లోకేశ్ పాద‌యాత్ర టీడీపీని ఏ తీరానికి న‌డిపిస్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అధికార‌మే ల‌క్ష్యంగా లోకేశ్ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే లోకేశ్ పాద‌యాత్ర టీడీపీకి బ‌ల‌మా? బ‌ల‌హీన‌తా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ మైంది.…

లోకేశ్ పాద‌యాత్ర టీడీపీని ఏ తీరానికి న‌డిపిస్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అధికార‌మే ల‌క్ష్యంగా లోకేశ్ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే లోకేశ్ పాద‌యాత్ర టీడీపీకి బ‌ల‌మా? బ‌ల‌హీన‌తా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ మైంది. గ‌తంలో పీకే టీం టీడీపీని గెలిపిస్తే… లోకేశ్ సీఎం అవుతార‌ని ప్ర‌చారం చేస్తోంద‌ని, ఇది ముమ్మాటికీ టీడీపీని దెబ్బ తీసే కుట్ర అంటూ ఇదే ఎల్లో ప‌త్రిక క‌థ‌నం ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. త‌ద్వారా లోకేశ్ నాయ‌క‌త్వం అంటే జ‌నంలో ఒక ర‌క‌మైన భ‌యం వుంద‌ని టీడీపీ అనుకూల మీడియానే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి లోకేశ్ ఏకంగా పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నారు. లోకేశ్ జ‌నంలోకి వెళితే, రెస్పాన్స్ ఎలా వుంటుందోన‌నే భ‌యం టీడీపీని వెంటాడుతోంది. అస‌లే లోకేశ్ తెలుగులో పండిత పుత్రుడ‌నే సంగ‌తి తెలిసిందే. మ‌న‌సులో భావాల్ని బ‌య‌టికి చెప్ప‌డంలో ఇప్ప‌టికీ లోకేశ్ త‌డ‌బ‌డుతున్నారు. గుడ్డి కంటే మెల్ల మేల‌నే చందాన‌, గ‌తం కంటే కొంత మెరుగు అయ్యారంతే.

సంక్రాంతి పండ‌గ త‌ర్వాత లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టి నిత్యం జ‌నం మ‌ధ్యే గ‌డిపేలా ప్లాన్ చేస్తున్నారు. 2024 ఎన్నిక‌లు టీడీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వి. ఏ మాత్రం తేడా కొట్టినా… టీడీపీతో పాటు లోకేశ్ భ‌విష్య‌త్ అంతే సంగ‌తులు. ఈ కార‌ణం గానే లోకేశ్ ఎంత త‌క్కువ ఫోక‌స్ అయితే అంత మంచిద‌ని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ లీడ‌ర్‌గా త‌న‌ను తాను నిరూపించుకోడానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని లోకేశ్ భావిస్తున్నారు. నాయ‌కుడిగా లోకేశ్ ఇప్పుడు నిరూపించుకోక‌పోతే, కొత్త నాయ‌క‌త్వం తెర‌పైకి వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే బీజేపీ పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే.

లోకేశ్ జనవరిలో న‌డ‌క ప్రారంభించి 2024 మార్చి నాటికి పూర్తి చేయాల‌నేది ల‌క్ష్యం. అప్ప‌టికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా వ‌స్తుంది. పాద‌యాత్రలో ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌డం మంచి పరిణామం. అయితే ముందుగా త‌న నాయ‌క‌త్వంపై ముందుగా జ‌నంలో భ‌యం పోగొట్టాల్సిన బాధ్య‌త లోకేశ్‌పై వుంది. ఆ త‌ర్వాత ఆద‌ర‌ణ దానిక‌దే వ‌స్తుంది.

ఒక‌వేళ పాద‌యాత్ర‌కు త‌గిన రెస్పాన్స్ రాక‌పోతే మాత్రం… దాని మూల్యం లోకేశ్ చెల్లించుకోవాల్సి వుంటుంది. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టాల్సి వుంటుంది.  మ‌రోవైపు లోకేశ్ పాద‌యాత్ర‌పై వైసీపీ ఉత్సాహం చూపుతోంది. లోకేశ్ జ‌నంలో ఎంత ఎక్కువ‌గా తిరిగితే త‌మ‌కు అంత మంచిద‌ని వైసీపీ భావ‌న‌. ఇలా రాజ‌కీయంగా ఎవ‌రి లెక్క‌లు వారికి ఉన్నాయి. అంతిమంగా ప్ర‌జాతీర్పు అన్ని లెక్క‌ల్ని స‌రి చేస్తుంది. అంత వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.