థర్డ్ వేవ్ ఈ నెల్లోనే.. మరో 2 నెలల్లో పీక్ స్టేజ్

కరోనా సెకెండ్ వేవ్, థర్డ్ వేవ్ పై చాలా సంస్థలు అంచనాలిచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి ఐఐటీ పరిశోధకుల అంచనా. సెకెండ్ వేవ్ పై వీళ్లు రిలీజ్…

కరోనా సెకెండ్ వేవ్, థర్డ్ వేవ్ పై చాలా సంస్థలు అంచనాలిచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి ఐఐటీ పరిశోధకుల అంచనా. సెకెండ్ వేవ్ పై వీళ్లు రిలీజ్ చేసిన అంచనాలు వందశాతం నిజమయ్యాయి. ఇప్పుడు మూడో వేవ్ పై కూడా ఈ పరిశోధకుల బృందం అంచనాలు విడుదల చేసింది. కఠోర సత్యాల్ని బయటపెట్టింది.

హైదరాబాద్, కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ అంచనాల్ని విడుదల చేసింది. వీళ్ల అంచనా ప్రకారం.. కరోనా మూడో ముప్పు ఈ నెలలోనే ప్రారంభమౌతుందని తేల్చిచెప్పారు. అక్టోబర్ లో థర్డ్ వేవ్ గరిష్టస్థాయికి చేరుతుందని.. రోజుకు లక్ష లేదా లక్షన్నర పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదముందని 
అంచనా వేశారు.

అందరూ భయపడినట్టే కేరళపై ఈ నిపుణుల బృందం రెడ్ అలర్ట్ జారీ చేసింది. సెకెండ్ వేవ్ లో మహారాష్ట్ర ఎలాగైతే హాట్ స్పాట్ గా మారిందో.. మూడో వేవ్ లో కేరళ కచ్చితంగా హాట్ స్పాట్ గా మారుతుందని వీళ్లు అంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. దేశంలో కరోనా మూడో దశ కేరళ నుంచే మొదలవుతుందని కూడా వీళ్లు చెబుతున్నారు. అయితే సెకెండ్ వేవ్ అంత ఉధృతంగా మాత్రం మూడో దశ ఉండదని చెబుతున్నారు. రెండు దశల కరోనా వల్ల మనుషుల్లో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి పెరగడంతో మూడో ముప్పు ప్రభావం పెద్దగా ఉండదని అంటున్నారు.

గుంటూరులో మూడో ముప్పు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గుంటూరు జిల్లా అంతటా కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. సెకెండ్ వేవ్ ఆంక్షల సడలింపులతో చాలామంది వీధుల్లోకి మాస్కు లేకుండా రావడంతో కేసులు అమాంతం పెరిగిన విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో మరోసారి గుంటూరులో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేస్తున్నారు. 

మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు పెరిగితే గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచే ఆ విస్తరణ ఉంటుందని అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు.

కరోనా నాసల్ స్ప్రే

మరోవైపు కరోనా నివారణ కోసం కొత్తరకం టీకాలు, వైద్య ఉత్పత్తులు వెలువడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే దేశీయ-విదేశీ టీకాలు మార్కెట్లోకి అందుబాటులోకి రాగా.. తాజాగా కరోనా నివారణకు నాజల్ స్ప్రే (ముక్కుతో పీల్చే ఔషధం) అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్ప్రే త్వరలోనే భారతీయ మార్కెట్లోకి కూడా రాబోతోంది. 

ఈ మేరకు కెనడాకు చెందిన శానొటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ తో గ్లెన్ మార్క్ సంస్థ చేతులు కలిపింది. వీళ్లు తయారుచేసిన కరోనా నాజల్ స్ప్రేను ఇండియా, ఆసియా మార్కెట్లలో గ్లెన్ మార్క్ విడుదల చేస్తుంది. ఇది ముక్కులోని కరోనా వైరస్ ను చంపేస్తుంది. తద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నిలువరించొచ్చని చెబుతోంది.