అమావాస్యకో, పుణ్నానికో ఏపీకి వచ్చే వాళ్లంతా నీతులు చెప్పడం ప్యాషనైంది. ఈ కోవలోకి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేరుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చిరునామా ఎక్కడో కూడా తెలియదు. ఎప్పుడూ ఏపీకి వెలుపల వుంటూ, ఆ రాష్ట్ర రాజకీయాలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. జగన్ ప్రభుత్వంపై ఇంతెత్తున లేస్తుంటారు. ఇవాళ తిరుపతిలో ఆయన ప్రత్యక్షమయ్యారు.
మీడియాతో మాట్లాడుతూ మరోసారి రాజధానిపై తన మార్క్ వెటకారం చేశారు. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఆరు నెలల క్రితం తీర్పు వెలువరిస్తే, ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ఏంటని గట్టిగా నిలదీశారు. ఏపీ రాజధాని అమరావతే అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు.
రాజధాని అమరావతికి గతంలో జగన్ మద్దతు ఇవ్వడాన్ని సత్యకుమార్ గుర్తు చేశారు. వికేంద్రీకరణ ముసుగులో జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇదే బీజేపీకి గతంలో టీడీపీతో విభేదాలు వచ్చినప్పుడు ఏం చేసిందో నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కర్నూలు డిక్లరేషన్ పేరుతో రాయలసీమలో రెండో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
రాయలసీమలో గవర్నర్ కార్యాలయం, అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వంపై ఇదే రాయలసీమ బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు జగన్ కర్నూలు డిక్లరేషన్ కంటే భిన్నంగా ఏం చేస్తున్నారనే ప్రశ్నలొస్తున్నాయి. తాము చేస్తే మాత్రం రాయలసీమ అభివృద్ధి కోసం, మరెవరైనా చేస్తే విద్వేషాలు రెచ్చగొట్టడానికంటూ విమర్శలు చేయడం బీజేపీకే చెల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రాంతానికో మాట చెబుతూ పబ్బం గడుపుకునే స్వభావాన్ని మార్చుకోవాలని సత్యకుమార్‌కు నెటిజన్లు హితవు చెబుతున్నారు. బీజేపీ ద్వంద్వ విధానాల వల్లే ఏపీలో ఆ పార్టీ ఎదగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.