ఏబీ త‌ప్పు ఒప్పు కున్న‌ట్టేనా…!

టీడీపీ పాల‌న‌లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉద్యోగం మాత్ర‌మే చేసి ఉంటే విమ‌ర్శ‌లకు అవ‌కాశం ఉండేది. కాదు. కానీ ఆయ‌నకు చంద్ర‌బాబుపై స్వామి భ‌క్తి ఎక్కువ. దీంతో అస‌లు ప‌ని వ‌దిలేసి,…

టీడీపీ పాల‌న‌లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉద్యోగం మాత్ర‌మే చేసి ఉంటే విమ‌ర్శ‌లకు అవ‌కాశం ఉండేది. కాదు. కానీ ఆయ‌నకు చంద్ర‌బాబుపై స్వామి భ‌క్తి ఎక్కువ. దీంతో అస‌లు ప‌ని వ‌దిలేసి, కొస‌రు ప‌నుల్లో నిమ‌గ్న‌మై..చివ‌రికి చిక్కులు తెచ్చుకున్నార‌నే అభిప్రాయాలు ఐఏఎస్‌, ఐపీఎస్ వ‌ర్గాల్లో ప్ర‌చార‌మ‌వుతోంది. “అతి సర్వత్ర వర్జయేత్“ అంటే ఏ విషయంలోనూ అతిగా ఉండకూడ‌ద‌ని అర్ధం.

అయితే అధికారం ఉంద‌ని అహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తే ఏమ‌వుతుందో గుణ‌పాఠం నేర్చుకునేందుకు ఎన్నైనా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవ‌చ్చు. ఇందులో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఎపిసోడ్ కూడా ఒక‌ట‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

తాజాగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఐపీఎస్ ఉద్యోగానికే అన‌ర్హుడ‌ని, డిస్మిస్ చేయాలంటూ కేంద్ర హోంశాఖ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం లేఖ రాసింది. దీనిపై  ఏబీ వెంకటేశ్వ‌ర‌రావు స్పందించారు. తాను త‌ప్పు చేశాన‌నే సంగ‌తిని ఆయ‌న ప‌రోక్షంగానే అంగీక‌రించార‌ని ఆ స్పంద‌న‌పై అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

“ప్ర‌తీకార చ‌ర్య‌ల్లో భాగంగానే నాపై ప్ర‌భుత్వం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించి అభియోగాలు మోపింది. ఎలాంటి ఆధారాలు లేక‌పోయినా అవి నిరూప‌ణ అయిన‌ట్టు విచార‌ణాధికారి ఏక‌ప‌క్షంగా నివేదిక ఇచ్చారు. అస‌త్య వివ‌రాల‌తో ఉన్న దాన్ని తిర‌స్క రించాల‌ని కోరుకుంటున్నా. విచార‌ణాధికారి ప్ర‌భుత్వంతో శృతి క‌లిపి లేని ఆధారాలు ఉన్న‌ట్టుగా పేర్కొన‌డంతో పాటు వాస్త‌వాల్ని వ‌క్రీక‌రించి రెండు అభియోగాలు నిరూప‌ణ అయిన‌ట్టు నివేదించారు” అని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు లేఖ రాశారు.

ఈ లేఖ‌లో మొట్ట మొద‌టి వాక్యంలోనే…. “ప్ర‌తీకార చ‌ర్య‌ల్లో భాగంగానే” అని ప్ర‌స్తావించ‌డం ద్వారా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తాను త‌ప్పు చేశాన‌ని చెప్ప‌క‌నే చెప్పార‌ని అధికార పార్టీ నేత‌లు, కొంద‌రు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు అంటున్నారు. 

ముందు తాను క‌క్షపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం వ‌ల్లే ప్ర‌భుత్వం ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింద‌నే భావ‌న ఆయ‌న మాటల్లో ప్ర‌తిబింబించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఒక్క వాక్యం చాలు ఏబీ తాను త‌ప్పు చేసిన‌ట్టు ఒప్పుకున్నార‌ని చెప్పేందుకంటు న్నారు. ఏబీ వ‌ర్సెస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్న‌ట్టు సాగుతున్న ఈ ఆట‌లో చివ‌రికి ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.