రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కఠిన పరీక్ష పెడుతున్నారు. ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొని చిన్నోపెద్దో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో రూపంలో కఠిన పరీక్ష పెట్టడం ఈ రెండేళ్ల పాలన ప్రత్యేకత అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నెలంతా పనిచేస్తే… జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయ స్థితికి ఉద్యోగులను నెట్టి వేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కింది. నెలాఖరు వస్తోందంటే ప్రభుత్వానికి కూడా టెన్షన్ తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు ప్రతి నెలా రూ.5,500 కోట్ల వరకు అవసరమవుతోంది.
ఇంత మొత్తాన్ని నెలాఖరుకు సమకూర్చుకోవడం కష్టమవుతున్నదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకటో తేదీ ఆదివారం రావడంతో జీతం గురించి ఉద్యోగులు పట్టించుకోలేదు. రెండో తేదీ సోమవారం కనీసం సగం మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు కూడా వేతనం అందని దుస్థితి. కేవలం కొద్ది మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు మాత్రమే జీతాలు జమ కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తమకు జీతాలు, పింఛన్ అందేందుకు ఎన్ని రోజులు పడుతుందోననే ఆందోళన వారిలో నెలకుంది. ఒకట్రెండు నెలలైతే సరిపెట్టుకోవచ్చని, కానీ ఇటీవలి కాలంలో ఆలస్యంగా జీతాలు జమ చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఉద్యోగులు, పింఛన్‌దారులు మండిపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ జీతాలు, పింఛన్లు ఎప్పటికి అందుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. గతంలో సచివాలయ ఉద్యోగులు, ఇతరత్రా కొన్ని ముఖ్యమైన శాఖల్లో పని చేసే ఉద్యోగులకు మాత్రం ఒకటో తేదీకి జీతాలు జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్యోగులు, పింఛన్‌దారులు తమపై తామే సెటైర్లు వేసుకుంటున్నారు.
జీతాలు, పింఛన్లకు సంబంధించి ఉద్యోగులకు ప్రభుత్వం స్లాట్ బుక్ చేస్తే సరిపోతుందని వ్యంగ్యంగా దెప్పి పొడుస్తున్నారు. స్లాట్ బుకింగ్‌లో వచ్చే డేట్ ప్రకారం జీతాలు తీసుకుంటే, ఎలాంటి బాధ ఉండదని వెటకారంగా అంటున్నారు. ఒకటో తేదీన జీతం జమ అయిన వాళ్లు లాటరీ తగిలినంత ఆనందంతో స్వీట్లు పంచుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
ఉద్యోగులు, పింఛన్‌దారులకు మొత్తం రూ.5,500 కోట్లు చెల్లించాల్సి వుండగా, సోమవారం రూ. 2000 కోట్లలోపు జమ చేసినట్టు ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. దీన్ని బట్టి ఎంత మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వేతనాలు అంది ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగులు, పింఛన్‌దారులకు కనీసం జీతాలు కూడా అందించలేని దుస్థితిపై ప్రతినెలా చర్చ జర గడం తనకు ఎంత మాత్రం మంచిదో ప్రభుత్వం ఆలోచించుకోవాల్సి ఉంది.ఈ పరిణామాలు జనంలోకి నెగెటివ్ సంకేతాలు తీసుకెళుతాయని హెచ్చరించక తప్పదు.