భర్త అరెస్ట్ తో శిల్పాషెట్టికి భారీ ఆర్థిక నష్టం

ఎప్పుడైతే రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యాడో, అప్పుడే శిల్పా షెట్టి మార్కెట్ పై అందర్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆమె బ్రాండ్ తో పాటు, ఆమె చేస్తున్న పలు కార్యక్రమాలపై ఆ…

ఎప్పుడైతే రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యాడో, అప్పుడే శిల్పా షెట్టి మార్కెట్ పై అందర్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆమె బ్రాండ్ తో పాటు, ఆమె చేస్తున్న పలు కార్యక్రమాలపై ఆ ప్రభావం పడుతుందని అంతా అనుమానించారు. ఆ అనుమానాలే నిజమయ్యాయి. భర్త అరెస్ట్ అవ్వడంతో, శిల్పా తన ఆదాయాన్ని కోట్ల రూపాయల్లో కోల్పోతోంది.

ప్రస్తుతం సూపర్ డాన్సర్ ఛాప్టర్-4కు జడ్జిగా వ్యవహరిస్తోంది శిల్పాషెట్టి. ఒక్కో ఎపిసోడ్ కు ఆమె 18 లక్షల నుంచి 22 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. ఎప్పుడైతే కుంద్రా అరెస్ట్ అయ్యాడో అప్పట్నుంచి ఆమె షూటింగ్ కు రావడం లేదు. అలా మొత్తంగా 2 కోట్ల రూపాయల వరకు శిల్ప నష్టపోయే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతానికి శిల్పాషెట్టి స్థానంలో ఓ ఎపిసోడ్ కు కరిష్మా కపూర్ ను పెట్టారు. మరో ఎపిసోడ్ కు జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ వచ్చారు. ఎక్కువ రోజులు ఇలా షో నడిపించలేరు. దీంతో రాబోయే రోజుల్లో ఈ షోలో శిల్ప ఉండాలా వద్దా అనే కఠిన నిర్ణయాన్ని కూడా ఛానెల్ యాజమాన్యం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే శిల్పాకు ఆర్థికంగా మరింత నష్టం.

అయితే మరో నెల రోజుల్లో శిల్పాషెట్టి షూటింగ్ కు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అది కూడా అప్పటికి కుంద్రా కేసు ఓ కొలిక్కి వస్తేనే. లేకపోతే ఆమె మరిన్ని ఎపిసోడ్స్ కు గైర్హాజరు అవుతుంది.

పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి గత నెల 19న అరెస్ట్ అయ్యాడు రాజ్ కుంద్రా. అతడిపై పలు అభియోగాలు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. దీంతో ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదని స్వయంగా పోలీసులే చెబుతున్నారు.

మరోవైపు ఈ కేసుకు, శిల్పాశెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసుతో శిల్పాషెట్టికి సంబంధం లేకపోయినప్పటికీ.. రాబోయే రోజుల్లో ఆమె బ్రాండ్ వాల్యూ పడిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికైతే ఆమె నష్టం టీవీ షోలకు మాత్రమే పరిమితమైంది. ఆమె బ్రాండ్ వాల్యూ ఎంత పడిపోయిందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.