జనసేన అధినేత రాజకీయ పార్టీ అయితే పెట్టాడుగానీ దాన్ని ఏనాడూ సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి ప్రత్యర్థులు ఆయన్ని పార్టీ టైం పొలిటీషియన్ అనే అంటున్నారు. పవన్ రాజకీయాలపట్ల నాన్ సీరియస్ గా ఉన్న కారణంగానే గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయింది. ఆయన కూడా రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయాడు.
సరే …ఒకాయన గెలిచాడనుకోండి. ఏం ప్రయోజనం? ఆయన వైసీపీకి మద్దతుదారుగా మారిపోయాడు. గత ఎన్నికల తరువాత కూడా పవన్ పాలిటిక్స్ పట్లనే కాదు, తన పార్టీ పట్ల కూడా సీరియస్ గా లేడనే భావన కలుగుతోంది. అప్పుడప్పుడు యేవో గంభీరమైన ప్రకటనలు చేయడం తప్ప పార్టీని బలోపేతం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టడంలేదు.
ఇప్పుడు బస్సు యాత్ర నిర్వహించే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాడు. సరే …అందుకు ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయనుకోండి. పార్టీవాళ్ళు చెబుతున్నదేమిటంటే పవన్ సినిమాల్లో నటిస్తూ ఆ వచ్చిన ఆదాయంతోనే పార్టీని నడిపిస్తున్నాడట. అందుకే ఆయనకు సినిమాలు చేయక తప్పదంటున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని గతంలో నిర్ణయించారు. యాత్రకు ఏర్పాట్లు చేసారు. ఇందు కోసం ఒక బస్సు కూడా సిద్దం చేసారు. కానీ, ఈ యాత్ర వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
కొద్ది నెలల క్రితం పవన్ బస్సు యాత్ర గురించి పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటన చేసారు. అక్టోబర్ 5 నుంచి పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభమవుతుందని చెప్పారు. అ సమయంలోనే ..ఆరు నెలల పాటు ప్రజల్లోనే ఉండేలా జిల్లాల పర్యటన ఉంటుందని చెప్పారు. వచ్చే వేసవి వరకు మొత్తం 26 జిల్లాల్లోనూ పర్యటన ఉంటుందని చెప్పుకొచ్చారు. ముందస్తు ఎన్నికలు ఖాయమనే అంచనాతో జనసేనాని బస్సు యాత్రకు ప్లాన్ చేసారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు చూస్తే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపించటం లేదు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో..ఇప్పుడు బస్ యాత్ర ఆరు నెలల పాటు చేసినా.. ఎన్నికలకు దాదాపుగా ఇంకా ఏడాది సమయం ఉంటుంది. దీంతో..ఇప్పుడు బస్సు యాత్ర చేయటం కంటే.. మరి కొంత కాలం ఆగి ప్రజల్లోకి వెళ్లటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ నేతలు చెబుుతున్నారు. మరో విషయం ఏమిటంటే వచ్చే ఏడాది జూన్ లోగా పవన్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసుకొని..ఇక పూర్తి సమయం పార్టీకి కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటి నుంచే బస్సు యాత్ర మొదలుపెడితే సినిమాలు పూర్తి చేయలేడు. నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారు. వారు పవన్ సినిమాలనే నమ్ముకొని ఉన్నారు. ఈయనకూ డబ్బులు కావాలి. కాబట్టే బస్సు యాత్ర వాయిదా వేశారని తెలుస్తోంది. బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటారని చెబుతున్నారు. ఈలోగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే పవన్ పరిస్థితి ఏమిటి?