దసరా పెద్ద పండుగ. విజయాలను అందించే విజయదశమి అది. అయితే దసరకూ వైసీపీకి మధ్య ఏదో తెలియని దోబూచులాట బంధం ఉంది. 2019లో జగన్ ముఖ్యమత్రి అయ్యాక మూడు రాజధానులు అని కొత్త కాన్సెప్ట్ తో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. అన్నీ అనుకూలిస్తే 2020 దసరా నాటికి విశాఖకు పాలన తరలివెళ్తుందని కూడా ఆ పార్టీ వారు అప్పట్లో చెప్పుకొచ్చారు.
కానీ 2020లో కరోనా వైరస్ పీక్స్ లో ఉండడం, అలాగే మూడు రాజధానుల బిల్లు వివాదస్పదం కావడంతో పాటు న్యాయ సమీక్షకు వెళ్ళింది. ఇక 2021 దసరాకు అన్ని అవరోధాలు తొలగిపోయి పాలన వైజాగ్ తీరానికి వస్తుందని కొత్త ప్రకటనలు వచ్చాయి.
అయితే 2021లో కూడా అదే పరిస్థితి ఉంది. పైగా అమరావతి రైతుల పాదయాత్ర ఆనాడు సాగడం, కోర్టులలో కీలకమైన విచారణ జరుతున్న సమయంలో ప్రభుత్వం కూడా ఎందుకొచ్చిన తొందర అనుకుంది. ఈలోగా మూడు రాజధానుల చట్టాన్ని కూడా వైసీపీ సర్కార్ రద్దు చేసుకుంది.
అలా ఏడాది కాలం గడచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది దసరాకు విశాఖ నుంచి పాలన అని ప్రకటనలు వెలువడ్డాయి. కానీ ఇపుడు చూస్తే మంత్రి గుడివాడ అమరనాధ్ తాజాగా కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన మొదలవుతుందని ప్రకటించారు.
అంటే 2023 జూన్ నుంచి విశాఖలో పాలన స్టార్ట్ అన్న మాట. అంటే వరసగా మూడు దసరాలు ఇలా ఉసూరుమని పోయాయనే అంటున్నారు. 2023 దసరా నాటికైనా విశాఖలో పాలన సాగుతుందా.