రాజధాని వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజధానులకు సంబంధించి బిల్లులు వెనక్కి తీసుకున్నప్పటికీ, హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతే రాజధానిగా వుంటుందని, ఆరు నెలల్లో పూర్తి చేయాలని కూడా ఏపీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. అన్నిటికీ మించి అసలు అసెంబ్లీకి రాజధాని ఎంపిక చేసే హక్కే లేదని ఏపీ హైకోర్టు తీర్పునివ్వడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనిపై ఏపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది.
ఈ నేపథ్యంలో శాసన వ్యవస్థ అధికారాలను హైకోర్టు తీర్పు నిర్వీర్యం చేసేలా వుందంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల మూడు రాజధానులపై అసెంబ్లీలో మరోసారి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని అధికార పార్టీ పలుమార్లు స్పష్టం చేసింది. వెనక్కి తీసుకున్న బిల్లులపై తీర్పు ఇవ్వడం ఏంటని ఏపీ సర్కార్ ప్రశ్నిస్తోంది. ఇలాంటి అనేక విషయాలను పొందుపరుస్తూ రాజధానిపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత … మళ్లీ ఆ చట్టంపై ఆలోచన చేస్తామని చెప్పిన తర్వాత.. వచ్చే చట్టం ఎలా ఉంటుందో తెలియకుండానే తీర్పు ఇవ్వడం సరైనదేనా అంటూ ప్రభుత్వం పిటిషన్లో ప్రశ్నించింది. ఏపీ రాజధాని నిర్ణయం ఒక కమిటీ సూచనకు అనుగుణంగా ఉంటుందన్నారు. అయితే, కమిటీ సూచనకు సంబంధం లేకుండా రాజధానిని నిర్ధారించారు. దానినే రాజధానిగా ఉంచాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ప్రభుత్వం ప్రశ్నించింది.
సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలని ఆదేశించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమే అని, పరిపాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకున్నట్టు పిటిషన్లో స్పష్టం చేశారు. చట్టం రాకుండానే, అది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడం ఎంత వరకు సబబని ఏపీ సర్కార్ ప్రశ్నించడం గమనార్హం.
రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం చివరికి ఏమవుతుందోననే చర్చకు తెరలేచింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్. రాజధానిపై ఆరు నెలల క్రితం తీర్పు చెప్పినప్పటికీ, ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించడానికి చాలా సమయం తీసుకుంది. దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుందోననే ఉత్కంఠకు దారి తీసింది.