తెలంగాణలో సెప్టెంబర్ 17 వివాదం నడుస్తోంది. ఈ రోజుని కేంద్రంగా చేసుకుని టీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. గత 8 ఏళ్లుగా ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, అకస్మాత్తుగా ఈ ఏడాది సెప్టెంబర్‌ను విమోచన దినంగా జరుపుకోవాలని ఎందుకు ముందుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోటి విద్యలు కూటి కోసమే అనే చందంగా, అధికార పార్టీల ప్రేమాభిమానాల వెనుక ప్రయోజనాలు దాగి వుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణలో సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని నిర్వహించడం గమనార్హం. మరోవైపు కేసీఆర్ సర్కార్ మాత్రం జాతీయ సమైక్యతా దినోత్సవంగా వేడుకలు జరుపుతోంది. విమోచన దినానికి ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రత్యేకంగా రావడం విశేషం. తెలంగాణపై రాజకీయంగా బీజేపీ ఎంత ప్రత్యేక శద్ధ పెట్టిందో అమిత్‌షా రాకే నిదర్శనం.
ఇదిలా వుండగా పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన విమోచన వేడుకల్లో అమిత్‌షాను మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభినవ సర్దార్ వల్లబాయ్ పటేల్‌తో పోల్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వెంటనే ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
“74 ఏళ్ల క్రితం ఒక హోంమంత్రి ప్రజలను ఐక్యం చేసేందుకు.. తెలంగాణను భారత్‌లో కలిపేందుకు వచ్చారు. ఇవాళ ఒక కేంద్ర మంత్రి (అమిత్ షా) వచ్చి ప్రజలను విభజించేలా మాట్లాడారు. దేశానికి నిర్ణయాత్మకమైన రాజకీయాలు కావాలి కానీ.. విభజన రాజకీయాలు ఉండొద్దు” అంటూ కేటీఆర్ ఘాటైన ట్వీట్ చేశారు.
సమయం, సందర్భం చూసుకుని కేటీఆర్ అదిరిపోయే పంచ్‌లు వేస్తుంటారు. ఇందుకు అమిత్‌షా, కిషన్రెడ్డిలపై తాజా ట్వీటే నిదర్శనం. ఇదొక్కటే కాదు, అమిత్‌షా చెప్పులను బండి సంజయ్ మోసిన సందర్భంలో కూడా కేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో కేటీఆర్ తర్వాతే ఎవరైనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.