తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత ఇటీవల కాలంలో రాజకీయంగా చాలా యాక్టీవ్‌గా వుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలకు ముందు, ఆ తర్వాత అని కవిత వ్యవహారశైలిని చూడాల్సి వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కవిత ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేవారు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలను కవిత అన్న, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేస్తుంటారు.
ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధాలున్నాయని, సీబీఐ విచారిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారో, అప్పటి నుంచి కవిత ఎదురు దాడికి దిగారు. ఊరికే కూచుని వుంటే ప్రత్యర్థులు రెచ్చిపోతారని ఆమె గ్రహించారు. దీంతో సమయాను కూలంగా బీజేపీపై ఆమె తీవ్ర విమర్శలు, సెటైర్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్రహోంశాఖ మంత్రి అమిషాపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
స్వాతంత్ర్య పోరాటంలో మీ (బీజేపీ) పాత్ర ఏంటని ఆమె నిలదీశారు. అలాగే హైదరాబాద్ సమైక్యత ఉద్యమంలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ బీజేపీ పాత్ర ఏంటని అమిత్‌షాను ట్విటర్ వేదికగా కవిత ప్రశ్నించారు. వీటి సమాధానాల కోసం తెలంగాణ బిడ్డగా ఎదురు చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజలకు వారి హక్కులు కల్పించడానికి బీజేపీ చేసింది శూన్యమని వెటకరించారు. కేవలం రాష్ట్రాలకు హామీలివ్వడం, ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించగానే, వంచించడం బీజేపీకి బాగా అలవాటైన విద్యగా ఆమె తప్పు పట్టారు.
ఇదే సందర్భంలో తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పొగడ్తలు కురిపించారు. సామరస్యం, ఏకత్వం, ప్రజా బలం.. ఇవే సీఎం కేసీఆర్‌కు, తెలంగాణకు పునాది అని కవిత స్పష్టం చేశారు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనను అనవసరంగా బద్నాం చేశారనే ఆవేదన కవితలో ఉంది. అందుకే ఆమె బీజేపీపై ఘాటు విమర్శలకు వెనుకాడడం లేదు.