రాజధానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుది ఎప్పుడూ ఒకే మాట, ఒకే బాట. ఈ వ్యవహార శైలే ముఖ్యమంత్రి జగన్ మద్దతుదారుడిగా ఆయనపై ఎల్లో మీడియా ముద్ర వేసింది. రాజధాని అంశం తమ చేతల్లో వుందని, మార్చడానికి వీల్లేదని జీవీఎల్ పదేపదే చెబుతూ వుంటే, ఎల్లో బ్యాచ్‌కి ఇష్టమైన బీజేపీ నాయకుడు అయి వుండేవారు. కానీ ఆయనెప్పుడూ తన స్టాండ్ మార్చుకోలేదు.
ఇవాళ మరోసారి ఆయన మూడు రాజధానులపై తేల్చి చెప్పారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. దానిపై కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. అయితే అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అయితే జగన్ ప్రభుత్వానికి కూడా ఆయన చురకలు అంటించారు.
మూడు రాజధానుల ప్రతిపాదన ఒక రాజకీయ ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. సీఆర్‌డీఏతో రైతులు ఒప్పందం చేసుకు న్నారని, అదే విషయాన్ని హైకోర్టు కూడా ప్రస్తావించిందని ఆయన చెప్పుకొచ్చారు. రాజధానిని మార్చడం అంత సులువు కాదని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో టీడీపీ అనుకూల బీజేపీ నేతలు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
అమరావతి నుంచి అంగుళం కూడా రాజధాని కదలదని సుజనా చౌదరి పలుమార్లు ప్రకటించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో జోక్యం చేసుకుంటుందని కూడా ఆయన హెచ్చరించారు. సుజనా చౌదరి పరువును పలుమార్లు జీవీఎల్ తీశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా తాను చెప్పిందే ఫైనల్ అని అధికారికంగా జీవీఎల్ ప్రకటించి, టీడీపీ అనుకూల బీజేపీ నేతల నోళ్లు మూయించారు.
మూడు రాజధానులపై తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో జీవీఎల్ చెప్పిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.