ఇంద్రగంటి ..ఒకటో ప్రమాద హెచ్చరిక?

టాలీవుడ్ లో కాస్త విషయం వున్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకరు. అందులో అణుమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన చిన్న, పెద్ద సినిమాలు కానీ, ఫ్లాప్, హిట్ సినిమాలు…

టాలీవుడ్ లో కాస్త విషయం వున్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకరు. అందులో అణుమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన చిన్న, పెద్ద సినిమాలు కానీ, ఫ్లాప్, హిట్ సినిమాలు కానీ ఇంతో అంతో విషయం వున్నవే తప్ప అస్సలు విషయం లేని డొల్లలు కావు. మసి పూసి మారేడుకాయ చేసే వైనమూ కాదు. అలాంటిది తొలిసారి ఆయన తొలి తప్పటడుగు వేసినట్లు కనిపిస్తోంది. 

సమ్మోహనం సినిమా తరువాత వి సినిమా చేసారు ఫెయిల్ అయినా కూడా అదో స్టయిల్ థ్రిల్లర్ అని నచ్చిన వారు కూడా వున్నారు. ఎందుకంటే అందులో కంటెంట్ వుంది. కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా దగ్గరకు వచ్చేసరికి కంటెంట్ తక్కువ ఆయన స్వంత భావనల రుద్దుడు ఎక్కువ అన్నట్లు కనిపిస్తోంది. 

మనం ముందు సరైన కంటెంట్ తో సినిమా తీస్తూ అప్పుడు అందులో ఎత్తి పొడుపులు..సెటైర్లు వేసుకోవాలి. అంతే తప్ప మనం డొల్ల కంటెంట్ పట్టుకుని దాంట్లో ఎదుటి వారికి చురకలు పెట్టాలనుకోకూడదు. దర్శకుడు విశ్వనాధ్ ఇలాంటి చిన్న చిన్న చురకలు వేసే వారు. కానీ ఆయన సినిమాలు ఓ స్థాయిలో వుండేవి కనుక వాటిల్లో చురకులు వేసినా చెల్లుబాటు అయింది.

పూరి జగన్నాధ్ నేనింతే సినిమా తీస్తే సినిమా ఆడకపోయినా ఇండస్ట్రీ జనాలు అంతా కనెక్ట్ అయ్యారు. నిర్మొహమాటంగా టాలీవుడ్ వ్యవహారాలను ఎండగట్టాడన్నవారు వున్నారు.. అందులో నికార్సయిన సినిమా జర్నీ వుంది. కానీ ఆ అమ్మాయి లో కేవలం ఇంద్రగంటి పర్సనల్ వ్యూస్ మాత్రమే వున్నట్లున్నాయి. ఈ సినిమాలో ఇంద్రగంటి నిర్మాతలను తప్పు పట్టారు. 

దర్శకులు మాస్ సినిమాలు తీస్తారని తప్పు పట్టారు. సినిమా టైటిళ్లను వెటకారం చేసారు. సినిమా జర్నలిస్ట్ లను తప్పు పట్టారు. వెబ్ సైట్లను తప్పు పట్టారు. ఇలా అందరినీ వెటకారం చేసి, తప్పు పట్టి ఇంద్రగంటి చేసింది ఏమిటో ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయిపోయింది. మార్నింగ్ షో తొనే సినిమా ఢమాల్ మనే టాక్ రావడంతో ఇంద్రగంటి చేసిన వెటకారాలు అన్నీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి.

వి సినిమా ఓటిటికి వెళ్లిపోయింది కనుక ఆ రేటింగ్..ఈ రేటింగ్..ఇంత మంది చూసారు. అంత మంది చూసారు అనే టాక్ తో తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ థియేటర్ విడుదల. ఇనీషియల్ లెక్కల ప్రకారం నిర్మాతలు ముగ్గురికి కలిసి కనీసం మూడు కోట్లు పోతాయని లెక్కలు వినిపిస్తున్నాయి. మరి మిగిలిన దర్శకుల ను, నిర్మాతల నడవడికను, టైటిళ్లను, ఇలా ప్రతి ఒక్క దాన్నీ తప్ప పట్టి ఇంద్రగంటి సాధించింది ఇదేనా?

ఇప్పుడు ఈ ఫ్లాపుల భారం మోస్తున్న ఇంద్రగంటికి అవకాశం రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందేనేమో? ఇంద్రగంటికి ఈ ప్లాపు తొలి హెచ్చరిక మాత్రమే. ముందు తను సరైన సినిమా ప్లాన్ చేసుకుని తీసి, అప్పుడు ఎదుటవారి మీద సెటైర్లు వేస్తే బెటరేమో?