వైసీపీకి నిరాశ క‌లిగిస్తున్న ఉత్త‌రాంధ్ర‌!

క‌ర్నూలుకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హైకోర్టు ఇవ్వాల్సిందే అనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏకంగా హైకోర్టు సాధ‌న స‌మితి పేరుతో న్యాయ‌వాదులు, వారికి సంఘీభావంగా ప‌లు రాయ‌ల‌సీమ సంఘాలు ఉద్య‌మిస్తున్నాయి. శ్రీ‌బాగ్ ఒప్పందం ప్ర‌కారం క‌ర్నూలుకు…

క‌ర్నూలుకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హైకోర్టు ఇవ్వాల్సిందే అనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏకంగా హైకోర్టు సాధ‌న స‌మితి పేరుతో న్యాయ‌వాదులు, వారికి సంఘీభావంగా ప‌లు రాయ‌ల‌సీమ సంఘాలు ఉద్య‌మిస్తున్నాయి. శ్రీ‌బాగ్ ఒప్పందం ప్ర‌కారం క‌ర్నూలుకు హైకోర్టు ఇవ్వాల్సిందే అని బీజేపీ, క‌మ్యూనిస్టు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. తొలి భాషా ప్ర‌యుక్త రాష్టంగా ఆంధ్ర‌రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతూనే వుంద‌నే ఆవేద‌న ఆ ప్రాంత ప్ర‌జానీకంలో వుంది.

అమ‌రావ‌తి రాజ‌ధాని ఎంపిక‌కు ముందు కూడా క‌ర్నూలులో కనీసం హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ రాయ‌ల‌సీమ వ్యాప్తంగా విద్యార్థులు, న్యాయ‌వాదులు, రైతులు త‌దిత‌రులు ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ డిమాండ్‌ను ఖాత‌రు చేయ‌లేదు. ఆ ప‌ర్య‌వ‌సాన‌మే నేటి రాజ‌ధాని దుస్థితి అని చెప్ప‌క త‌ప్ప‌దు. 2014లో రాయ‌ల‌సీమ‌కు క‌నీసం హైకోర్టు ఇచ్చి వుంటే … నేడు ఈ రాజ‌ధానుల గొడ‌వే వుండేది కాదు.

తాజాగా మ‌రోసారి క‌ర్నూలుకు హైకోర్టు ఇవ్వాల‌నే ఉద్య‌మం ఊపందుకుంది. కానీ విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని ఇవ్వాల‌నే డిమాండ్‌తో ఉత్త‌రాంధ్ర‌లో ఉద్య‌మాలు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎంత‌సేపూ అధికార పార్టీ మంత్రులు, నాయ‌కులు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిపై బ‌ల‌మైన గొంతుక వినిపిస్తున్నారు. అంత‌కు మించి ఉత్త‌రాంధ్ర పౌర స‌మాజం నుంచి విశాఖలోనే ప‌రిపాల‌న రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌నే బ‌ల‌మైన డిమాండ్‌తో ఉద్య‌మాలు రావ‌డం లేదు.

ఈ ధోర‌ణి ప్ర‌భుత్వానికి నిరాశ క‌లిగించేదే. అర‌స‌వెల్లి వ‌ర‌కూ చేప‌ట్టిన పాద‌యాత్ర ఉత్త‌రాంధ్ర‌పై దండ‌యాత్ర అని అధికార పార్టీ నాయ‌కులు అంటున్నారు. ఇదే మాట పౌర స‌మాజం నుంచి వ‌స్తే… ప్ర‌భుత్వం చేప‌ట్టిన మూడు రాజ‌ధానుల స‌బ్జెక్ట్‌కు బ‌లం వ‌స్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఉత్త‌రాంధ్ర నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో అధికార పార్టీ ఇబ్బందిగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో వైసీపీ వైఖ‌రి ఎలా వుంటుందో చూడాలి.