నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయంగా నవ్వులపాలవుతున్నారు. బ్రహ్మానందరెడ్డి వ్యక్తిగతంగా నెమ్మ దస్తుడు, మృధు స్వభావి. ఈ లక్షణాలనే రాజకీయంగా తనకు అవకాశంగా మలుచుకునేందుకు టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారు. ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలో కూడా తానే పాగా వేయాలని ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. అయితే అఖిలప్రియకు భూమా బ్రహ్మానందరెడ్డి వరుసకు అన్న అవుతారు. కానీ రాజకీయాల్లో బంధాలకు చోటు లేదని ఆమె చెప్పకనే చెబుతున్నారు.
ఈ నెల 18న నంద్యాలలో అఖిలప్రియ గృహ ప్రవేశం చేయనున్నారు. అద్దెకు ఇల్లు తీసుకుని అందులోనే నివాసం, టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసినట్టు అఖిలిప్రియ అనుచరులు చెబుతున్నారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, అలాగే సీనియర్ లీడర్ ఫరూక్ ఉన్నారు. వీరిని కాదని అఖిలప్రియ నంద్యాలలో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై బ్రహ్మానందరెడ్డి వర్గం మండిపడుతోంది.
మరోవైపు బ్రహ్మానందరెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దీని వెనుక అఖిలప్రియ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. బ్రహ్మానందరెడ్డి అసమర్థత వల్లే నంద్యాలలో భూమా కుటుంబం పట్టు కోల్పోతోందని, అందువల్లే అఖిలప్రియ ఎంటర్ కావాల్సి వస్తోందనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా అఖిలప్రియ చేపట్టిన గృహ ప్రవేశం, కార్యాలయ ప్రారంభానికి వెళ్లకూడదని బ్రహ్మానందరెడ్డి ఫోన్ చేసి చెబుతున్నారని అఖిలప్రియ వర్గం ఆరోపిస్తోంది. బ్రహ్మానందరెడ్డి నిస్సహాయుడిగా మారడం వల్లే తమ నాయకురాలికి నంద్యాల బాధ్యతలు అప్పగించినట్టు అఖిలప్రియ అనుచరులు ప్రచారం చేస్తున్నారు.
భూమా బ్రహ్మానందరెడ్డి అడ్డుకోవాలని అనుకున్నా… భారీ సంఖ్యలో అఖిలప్రియ చేపట్టిన కార్యక్రమానికి వస్తారని ఆమె అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల తమకు రెండు కళ్లు లాంటివని అఖిలప్రియ, జగత్‌విఖ్యాత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు నంద్యాలలో టీడీపీ కార్యాలయాన్ని బ్రహ్మానందరెడ్డి ఎలా అడ్డుకోవాలని అనుకుంటున్నారని అఖిలప్రియ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల బ్రహ్మానందరెడ్డి ఇంటికి జగత్‌విఖ్యాత్‌రెడ్డి వెళ్లి ఆహ్వానించినట్టు సమాచారం. ఈ సందర్భంగా అఖిలప్రియ, విఖ్యాత్ రాజకీయ వ్యవహారాలపై బ్రహ్మానందరెడ్డి సీరియస్ అయినట్టు తెలిసింది. మొదట తన తండ్రి వీరశేఖరరెడ్డి భూమా కుటుంబంలో రాజకీయానికి బీజం వేశారని, నాగిరెడ్డి ఆ తర్వాత కాలంలో వచ్చారనే విషయాన్ని గుర్తు చేసినట్టు తెలిసింది.
భూమా కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు కాస్త… టీడీపీలో కుంపటి రగిల్చాయి. అయితే భూమా బ్రహ్మానందరెడ్డి మంచితనమే ఆయన్ను చివరికి నవ్వులపాలు చేస్తోందని ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చ జరుగుతోంది.