తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను సంకల్పిస్తున్న మూడో కూటమి అనేది సాధ్యం అవుతుందా కాదా అనే మీమాంసలో నిన్నటి దాకా ఉన్నారు. ఆయన ఒక్కడే కాకుండా అనేకమంది జాతీయ నాయకులు ఇప్పుడు పూనుకుంటూ ఉండడంతో.. వాళ్లు మెయిన్ ఫ్రంట్ గా పిలుచుకుంటున్న మూడో కూటమి కార్య రూపం దాల్చడం తేలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ లో కొత్త అశ మొదలైంది. దేశానికి తానే ప్రధాని కావాలని అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ లోని ఈ అత్యాశ మూడో కూటమికి చేటు చేసే ప్రమాదమే ఎక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ ఇప్పుడు తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలన్నీ కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కీలక పాత్ర పోషించాలని తీర్మానాలు చేయడం ద్వారా ఆయన భజన ఆల్రెడీ ప్రారంభించాయి.
జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నట్టుగా కేసీఆర్ విస్పష్ట ప్రకటన చేసిన తర్వాతే .. వీళ్ళందరూ ఆయన వెళ్లాలని కోరుతూ.. తీర్మానాలు చేయడం ఒక పెద్ద కామెడీ! కేసీఆర్ ఏకంగా ప్రధాని అయి ఈ దేశానికి దిశా నిర్దేశం చేయాలని టిఆర్ఎస్ మంత్రులు మరో భజన రూపంలో ఆయన మనోగతాన్ని ప్రతిబింబించడం ప్రారంభించారు. మొత్తానికి ఆయన ప్రధాని పదవి మీద కన్నేశాడని.. ఆయన ప్రధాని పదవికి అర్హుడని టిఆర్ఎస్ తరఫు నుంచి ప్రతిపాదన పుష్ చేసేసారు.
అయితే కేసీఆర్ మరీ అంత అమాయకుడేమీ కాదు. తన పార్టీ వాళ్లు భజన చేసినంత మాత్రాన అను ప్రధాని అయిపోయే అవకాశం ఉండదని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో అదే ప్రతిపాదనను తెర మీదికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గుజరాత్లో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి, తర్వాత ప్రాభవం కోల్పోయిన శంకర్ సింగ్ వాఘెలా ను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు, సత్కరించారు. ఆయనతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనే ప్రతిపాదన మళ్లీ వినిపించారు. తాను ప్రధాని కావాలని దేశ నాయకులు అందరూ కోరుకుంటున్నారు, అని కూటమిలోని మిగిలిన కీలక నాయకులకు సంకేతాలు పంపడం ఆయన ఉద్దేశం.
మూడో కూటమి కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తెర మీదికి వచ్చిన తర్వాత కేసీఆర్ తొందరపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆల్రెడీ చాలామంది నితీష్ ప్రధానమంత్రి అవుతారని అంచనాలను వినిపిస్తున్నారు. శరద్ పవార్ అనుయాయులు ఆయనని మించి ప్రధాని కాగల అర్హత ఎవరికీ లేదని చాటుతున్నారు. మరోవైపు మమతా బెనర్జీ కూడా రేసులో ఉన్నారు. ఇందరి మధ్యలో కేసీఆర్ ప్రధాని పదవిపై పెంచుకుంటున్న అత్యాశ అసలు కూటమికే చేటు చేస్తుంది.
కేవలం 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న తెలంగాణకు నాయకుడు కేసీఆర్. ఆయన నూరు శాతం ఎంపీ సీట్లను గెలిపించుకున్నప్పటికీ ఆ మాత్రం సీట్లతో ప్రధాని కావాలని అనుకోవటం దురాశ. అంతకంటే పెద్దసంఖ్యలో ఎంపీ లు ఉండే కీలక నాయకులు అవకాశం వదులుకోరు. రచ్చ, తగాదాలు మొదలవుతాయి. ఆ రకంగా చూసినపుడు కేసీఆర్ అత్యాశ మూడో కూటమి పురుడు పోసుకోక ముందే అందులో లుకలుకలకు కారణం అవుతోంది.