విజన్-2047 పేరుతో టీడీపీ తన మార్క్ రాజకీయానికి తెరలేపింది. కేవలం ఏపీకే పరిమితం కాకుండా, ఏకంగా భారతదేశం చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తున్నారని టీడీపీ, ఆయన అనుకూల మీడియా కొత్త రాగం ఆలపిస్తోంది. ఇదే సందర్భంలో చంద్రబాబు విజనరీపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చురకలు అంటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ఓ రేంజ్లో ఆడుకున్నారు.
చంద్రబాబు విజనరీపై చురకలు అంటించారు. చంద్రబాబు విజనరీ జిమ్మిక్కులు ఉట్టికి ఎగరలేనమ్మ…ఆకాశానికి ఎగిరిన చందంగా వుందని నాని దెప్పి పొడిచారు. చంద్రబాబు విజన్ 2020 ఏమైందని ఆయన నిలదీశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని నమ్మబలుకుతున్న చంద్రబాబునాయుడు, గతంలో విద్యుత్ చార్జీల తగ్గింపుకోరుతూ ఉద్యమిస్తున్న వారిపై కాల్పులు జరిపింది ఈయన కాదా? అని నిలదీశారు.
గతంలో వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే, తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వుంటుందని వెటకరించింది ఈ విజనరీ కాదా? అని కుళ్ల పొడిచారు. విజన్ 2020లో వ్యవసాయాన్ని తగ్గిస్తానని చంద్రబాబు చెప్పారని, మరి ఇప్పుడు ఆ రంగంపై 63 శాతం ఆధారపడ్డారని…2020 విజన్ ఏమైందని నిలదీశారు. ఎన్టీఆర్ గొప్పనాయకుడని చంద్రబాబు అంటున్నారని, మరి ఆయన్ను వెన్నుపోటు ఎందుకు పొడిచారని ప్రశ్నించారు.
14 ఏళ్ల పాలనలో సొంత జిల్లా చిత్తూరుకు, కనీసం కుప్పానికైనా సాగునీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయావని ప్రశ్నించారు. 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు పూర్తి చేశారా? అని ఆయన పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనకు సంబంధంచి ముద్ర వేసిన కనీసం ఒక్క పథకం పేరైనా ఆయన చెబుతారా? అని నాని నిలదీయడం విశేషం. చంద్రబాబుకు తెలిసిందల్లా పబ్లిసిటీ పథకం ఒక్కటే అని ఆయన చురక అంటించారు.