డైనోసార్ కు పోటీగా వ్యాక్సిన్.. అప్పటి పుకార్లు నిజమే?

“ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ చేశాడు, అదే టైమ్ లో ది కశ్మీర్ ఫైల్స్ రిలీజ్ చేశాను. హిట్ కొట్టాను. ప్రభాస్ సలార్ రిలీజ్ చేసే టైమ్ కు వ్యాక్సిన్ వార్ సినిమా రెడీ చేస్తున్నాను.”…

“ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ చేశాడు, అదే టైమ్ లో ది కశ్మీర్ ఫైల్స్ రిలీజ్ చేశాను. హిట్ కొట్టాను. ప్రభాస్ సలార్ రిలీజ్ చేసే టైమ్ కు వ్యాక్సిన్ వార్ సినిమా రెడీ చేస్తున్నాను.” దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ స్టేట్ మెంట్ ఇచ్చినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం మొదలైన వెంటనే సదరు దర్శకుడు సీన్ లోకి వచ్చాడు. వాటిని ఖండించాడు.

ఇలాంటి అసత్యాలు ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదంటూ స్పందించాడు వివేక్ అగ్నిహోత్రి. మెగా బడ్జెట్ సినిమాలు తీసే మెగాస్టార్ ప్రభాస్ ను తను గౌరవిస్తానని, ఇలాంటి అర్థంలేని ఫేక్ స్టేట్ మెంట్స్ ను ఎవరు సృష్టిస్తున్నారో తెలుసుకోవాలనుందంటూ స్పందించాడు.

తాము చిన్న బడ్జెట్ లో, ప్రజల కోసం మాత్రమే చిన్న సినిమాలు తీస్తుంటామని.. పెద్ద కాన్వాస్ పై పెద్ద సినిమాలు తీసే ప్రభాస్ తో తమకు పోలిక ఏంటంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చి వివాదాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అప్పట్లో అన్ని స్టేట్ మెంట్స్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి, ఇప్పుడు తన వ్యాక్సిన్ వార్ సినిమాని నిజంగానే సెప్టెంబర్ 28కి రిలీజ్ చేస్తున్నాడు. ఈ మేరకు అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా వచ్చేసింది. దీంతో అప్పట్లో పుకార్లు అంటూ వచ్చిన వ్యాఖ్యలు, నిజంగానే వివేక్ నోటి నుంచి వచ్చి ఉంటాయనే చర్చ మళ్లీ మొదలైంది.

వ్యాక్సిన్ వార్ రిలీజ్ డేట్ ఇలా బయటకొచ్చిన వెంటనే అలా ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిజంగానే ప్రభాస్ పై అంత గౌరవం ఉంటే, సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివాదం చెలరేగిన టైమ్ లో “దమ్ముంటే ప్రభాస్ సలార్ సినిమాకు పోటీగా వ్యాక్సిన్ వార్ ను రిలీజ్ చేయ్” అంటూ చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ సవాల్ విసిరారు.

కట్ చేస్తే, ఇప్పుడు అదే నిజమైంది. సలార్ కు పోటీగా వ్యాక్సిన్ వార్ వస్తోంది. సలార్ సినిమా టీజర్ లో ప్రభాస్ ను డైనోసార్ తో పోల్చారు. “అయితే డైనోసార్ కు కూడా వ్యాక్సిన్ వేస్తారా..” అంటూ ఫన్నీ పోస్టులు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.