ఏపీలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్, తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోలీసులపై బెదిరింపులకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం. ఎన్నికలంటే రకరకాల శక్తులు, యుక్తుల ప్రమేయం వుంటుంది. అన్నీ ప్రయోగిస్తేనే విజయం వరిస్తుంది.
ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నేతలు సామదాన భేద దండోపాయలకు దిగుతుంటోంది. వీటిలో ఏదో ఒకటి పని చేయకపోతుందా? ఎన్నికల్లో ప్రయోజనం పొందకపోతామా? అనే ఆశ. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ పోలీసు అధికారులను తనదైన రీతిలో హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్‌కు తొత్తులుగా మారి తమను వేధిస్తున్న పోలీస్ అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెడ్ బుక్‌లోని పోలీసు అధికారుల పని పడతామని ఆయన హెచ్చరించడంపై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. రేవంత్‌రెడ్డి తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సంఘం నేతలు విమర్శించారు.
ఇటీవల చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డిని కూడా ఇదే రకంగా నారా లోకేశ్ హెచ్చరించారు. రెడ్ డైరీ రాస్తున్నానని, అందులో చిత్తూరు ఎస్పీది మొదటి పేరని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే రిషాంత్‌కు కళ్లు తెరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కండువా కప్పుకోని కార్యకర్తగా రిషాంత్‌రెడ్డిపై లోకేశ్ ఫైర్ అయ్యారు. టీడీపీ స్కూల్‌లో చదువుకున్న రేవంత్‌రెడ్డి… తెలంగాణలో తన తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నారు. బాబు పెంపకంలో ఎదుగుతున్న ఇద్దరి నేతల వార్నింగ్ వ్యూహం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.