సీన్ రిపీట్: అప్పుడు చంద్రబాబు.. ఈసారి పవన్

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితేంటి..? కాస్త వెటకారంగా చెప్పాలంటే కూరలో కరివేపాకు అనే సమాధానం వస్తుంది. తామే ప్రధాన ప్రతిపక్షం అంటూ కమలనాధులు జబ్బలు చరుచుకుంటున్నప్పటికీ వాస్తవంగా పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. దీనికితోడు…

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితేంటి..? కాస్త వెటకారంగా చెప్పాలంటే కూరలో కరివేపాకు అనే సమాధానం వస్తుంది. తామే ప్రధాన ప్రతిపక్షం అంటూ కమలనాధులు జబ్బలు చరుచుకుంటున్నప్పటికీ వాస్తవంగా పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. దీనికితోడు బీజేపీ పెట్టుకుంటున్న పొత్తులు కూడా ఎప్పటికప్పుడు చిత్తవుతూ వస్తున్నాయి. 

ఇప్పుడు పవన్ కల్యాణ్ తో దోస్తీ నడుస్తోంది. ఈ బంధం కూడా త్వరలోనే కటీఫ్ అవుతుందంటున్నార చాలామంది.

బాబు వాడుకున్నారు.. పవన్ కు చేతకాలేదు

గతంలో బీజేపీతో దోస్తీ కట్టారు చంద్రబాబు. ఎలాగోలా అధికారంలోకి వచ్చారు. బీజేపీకి కూడా కొన్ని సీట్లు, కొన్ని మంత్రి పదవులు వచ్చాయి. అయితే అవకాశం చూసి బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు బాబు. బీజేపీని సైడ్ చేయడం కోసమే ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారు. అప్పటివరకు ప్యాకేజీ జపం చేసిన బాబు. ఒక్కసారిగా హోదా కావాలన్నారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నాటకాలాడారు.

మొత్తమ్మీద బీజేపీకి రాంరాం పలికేశారు. ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. గతంలో చంద్రబాబు బీజేపీని వాడుకొని వదిలేశారు. అయితే పవన్ మాత్రం బీజేపీని వాడుకోలేకపోయారు. కేంద్రంతో లాబీయింగ్ చేసి పదవులు సంపాదించుకోలేకపోయారు. అలా బీజేపీని వాడుకోకుండానే వదిలేయబోతున్నారు జనసేనాని. తిరుపతి ఎన్నిక ఫలితం తర్వాత జనసేన-బీజేపీ మధ్య దూరం మరింత పెరిగింది. ఆ దూరాన్ని శాశ్వతం చేయాలని పవన్ భావిస్తున్నారట.

అదే సెంటిమెంట్ రిపీట్ అయితే పవన్ పరిస్థితేంటి?

పవన్ కల్యాణ్ బీజేపీని వదులుకోవడం చిటికెలో పని. ఎందుకంటే, ఆ రెండు పార్టీల మధ్య బంధం అంత బలహీనంగా ఉంది. తనకు ఎంతో అలవాటైన ఓ ప్రెస్ నోట్ ను ఇలా రిలీజ్ చేస్తే సరి, బంధం కాస్తా వీగిపోతుంది. అయితే ఇక్కడే ఓ నెగెటివ్ సెంటిమెంట్ తెరపైకొస్తోంది. బీజేపీని వదిలేసిన బాబు ఘోరంగా ఓడిపోయారు. అదే విధంగా పవన్ కూడా బీజేపీని వదిలేస్తే ఘోరంగా ఓడిపోతారనే సెంటిమెంట్ ఒకటి వినిపిస్తుంది.

నిజానికి పవన్ ఇప్పుడు కొత్తగా ఓడిపోయిందేం లేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయినప్పుడే పవన్ పరాజయం సంపూర్ణమైంది. ఏ కొద్దో గొప్పో ఆశ ఉంటే రాపాక రూపంలో అది కూడా పోయింది. కాబట్టి బీజేపీకి విడాకులు ఇవ్వడం వల్ల పవన్ కొత్తగా పోగొట్టుకునేది ఏదీ ఉండదు. కాకపోతే తెరవెనక ఆయన ఏమైనా నష్టపోతే నష్టపోవచ్చు. ఆ విషయాలు బయటకు రావు.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని వదిలించుకోవాలనే అనుకుంటున్నారు. అదే కనుక జరిగితే పవన్ జట్టు కట్టడానికి ఏపీలో ఫ్రెష్ గా మరో పార్టీ ఆయనకు దొరకదు. ఎందుకంటే ఇప్పటికే పవన్ అందరితో చేయి కలిపారు, ప్రస్తుతానికి బీజేపీకి తప్ప అందరికీ చేయిచ్చారు. చంద్రబాబు లాబీయింగ్ ఫలించకపోతే. వచ్చే ఎన్నికల్లో పవన్ సోలోగా బరిలోకి దిగే అవకాశం ఉంది.