విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబానికి సుప్రీంకోర్టు తీర్పుతో భారీ పరిహారం అందనుంది. మృతుడి కుటుంబానికి రూ.7.64 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిహారం కోసం బాధిత కుటుంబం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి న్యాయమే గెలిచింది. అసలేం జరిగిందంటే…
దుబాయ్ నుంచి 166 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా విమానం 2010లో మంగళూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 158 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యూఏఈకి చెందిన ఓ సంస్థ రీజినల్ డైరెక్టర్ మహేంద్ర కొడ్కనీ (45) ఉన్నాడు. కొడ్కనీ కుటుంబానికి రూ.7.35 కోట్లు పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) అప్పట్లో ఎయిరిండియాను ఆదేశించింది.
అయితే అనేక కారణాలు చూపుతూ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఎయిరిండియా నిరాకరించింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుం బం న్యాయపోరాటంలో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యానాలు చేసింది.
‘ఒక సంస్థ తమ ఉద్యోగుల ఆదాయాన్ని అనేక కారణాలతో వేర్వేరు కేటగిరీల కింద విభజించవచ్చు. అయితే, ఆ ఉద్యోగికున్న స్థాయి ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేయాలి. అతని మరణంతో సంభవించిన నష్టాన్ని నిర్ణయించేటప్పుడు అతని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలి’అని సుప్రీంకోర్టు పేర్కొంది.
అంతేకాదు, ఎన్‌సీడీఆర్‌సీ పేర్కొన్న రూ.7.35 కోట్ల నష్టపరిహారంలో ఇప్పటి వరకు చెల్లించని మొత్తానికి ఏడాదికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక వేళ అంతకంటే ఎక్కువగా చెల్లించినా పిటిషన్‌దారుల నుంచి రాబట్టేందుకు వీల్లేదని ఎయిరిండియాకు కోర్టు స్పష్టం చేసింది. మహేంద్ర కొడ్కనీ కుటుంబం సాగించిన న్యాయపోరాటం స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు.