కిరాణా దోపిడీ ఆగాలంటే..?

కరోనా లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. బియ్యం, నూనె, పప్పుల రేట్లు 25శాతం నుంచి 40శాతం వరకు ఎగబాకాయి. రవాణా సౌకర్యం లేదు కాబట్టి డిమాండ్ పెరిగి రేట్లు పెంచారనుకున్నాం.…

కరోనా లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. బియ్యం, నూనె, పప్పుల రేట్లు 25శాతం నుంచి 40శాతం వరకు ఎగబాకాయి. రవాణా సౌకర్యం లేదు కాబట్టి డిమాండ్ పెరిగి రేట్లు పెంచారనుకున్నాం. ఆంక్షలు సడలించిన తర్వాత కూడా రేట్లు తగ్గలేదు సరికదా రోజు రోజుకి పెరుగుతున్నాయి. పిల్లలు తినే ప్యాకేజ్డ్ వస్తువులు కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువగానే అమ్ముతున్నారు.

ఈ విషయంలో సగటు దుకాణదారుడిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. హోల్ సేల్ వ్యాపారులే వారికి రిబేటు తగ్గించి సరకు సరఫరా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డిమాండ్ ఉన్న కంపెనీల వస్తువుల్ని పక్కనపెట్టి, ఎక్కువ మార్జీన్ లభించే వాటిని ప్రోత్సహిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల కోల్పోయిన వ్యాపారాన్ని ఇప్పుడు వడ్డీతో సహా వసూలు చేసుకోవాలనుకుంటున్నారు.

వ్యాపార వర్గాలు బాగున్నాయి కానీ, మధ్యలో వినియోగదారులే తీవ్రంగా నష్టపోతున్నారు. అటు పెద్ద పెద్ద మాల్స్ కి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, ఇచ్చినా టైమింగ్ పై ఆంక్షలు పెట్టింది. సూపర్ మార్కెట్లు అందుబాటులో లేకపోయే సరికి కిరాణా షాపుల వాళ్లు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు. గతంలో సూపర్ మార్కెట్ల పోటీ తట్టుకోలేక వీధి చివరి కిరాణా వర్తకుడు కూడా రేట్ల విషయంలో చూసీ చూడనట్టు పోయేవారు, లాభం తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారు కానీ బేరాల్ని వదులుకోలేదు. ఇప్పుడు సూపర్ మార్కెట్లకు పరిమితులున్నాయి కాబట్టి జూలు విదిల్చి రేట్లు పెంచేశారు.

అధికారుల దాడులతో ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనుకోవడం అమాయకత్వమే. తూనికలు కొలతల శాఖ రోజుకి తనిఖీ చేసే షాపులెన్ని, విధించే జరిమానా ఎంత? వినియోగదారుడికి మేలు జరగాలంటే సూపర్ మార్కెట్లకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుమతివ్వాలి. టైమింగ్ విషయంలో ఆంక్షలు సడలించాలి. అప్పుడే పోటీ పెరిగి వస్తువుల రేట్లు మళ్లీ దిగొస్తాయి. అప్పటివరకూ కిరాణా దోపిడీని అరికట్టలేం. 

చంద్రబాబు రాజకీయానికి వారిద్దరూ బలయ్యారు