చంద్రబాబు ఈవీఎంలో చివరి ఓటు లెక్క బెట్టేవరకూ కూడా తమ పార్టీ గెలిచితీరుతుందని చెబుతారు. అంతటి పొలిటికల్ మ్యాజిక్ ఆయన సొంతం. అటువంటి చంద్రబాబు నిజంగా ఓడినా కూడా అది అసలు ఒప్పుకోరు. ఈవీఎంల నుంచి జనాల వివేచన వరకూ, వ్యవస్థల నుంచి అధికారుల వరకూ అందరి మీద ఓటమి బండను చాలా సులువుగా నెట్టేస్తారని కూడా అందరికీ తెలిసిన విషయమే.
అటువంటి చంద్రబాబు తాను ఓడిపోతానని ఏడాది ముందే తెలుసుకున్నారుట. అది కూడా తొలిసారి ఓటమి వేళ. అంటే 2004 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీని పాలిస్తున్న చంద్రబాబుకు తాను అధికారంలోకి మళ్ళీ రానని పక్కాగా తెలుసు అంటున్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.
అయినా సరే 2003లో చంద్రబాబు విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టారని, ఎక్కువ ధరలు వినియోగదారులపైన పడకుండా చర్యలు తీసుకున్నారని అచ్చెన్న గతం కధలు వినిపిస్తున్నారు. ఇలా బంగారంగా విద్యుత్ శాఖను చేసి అధికారాన్ని కూడా అందులో పెట్టి 2004 నాటికి వైఎస్సార్ అప్పగించారట.
సరే ఇదంతా ఎలాగున్నా 2004 ఎన్నికలకు ముందే బాబుకు వైఎస్సార్ చేతిలో ఓడిపోతానని తెలుసు అన్న సంగతి ఇప్పటిదాకా ఎక్కడా ఆఫ్ ది రికార్డ్ కూడా బయటపడని విషయం. దాన్ని అచ్చెన్న ఇపుడు ఇలా వైసీపీని తిట్టే ఊపులో, ఉత్సాహంలో బయటపెట్టేశారు.
మరి ఆ లెక్క ప్రకారం, బాబు రాజకీయ అంచనాల ప్రకారం చూసుకున్నా కూడా 2009, 2019 ఎన్నికల్లోనూ తాను గెలవను అని బాబుకు ముందే తెలిసిపోయిందేమోనని అటు తమ్ముళ్లతో పాటు, ఇటు వైసీపీ వంటి పార్టీలు కూడా ఇపుడు అనుమానిస్తున్నాయి.
మరి ఇలా ఓడిపోతానని తెలిసి కూడా బాబు వైసీపీ గెలిచినా నానా యాగీ చేశారా అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి బాబు బయటకు ఎన్ని డాంబికాలు పలికినా తన పార్టీ ఎప్పటికపుడు ఓడుతోందన్న సంగతి ముందే తెలుసుకుంటారన్న మాట.
అయితే ఆ విషయాన్ని ఏ మాత్రం చెప్పకుండాతమ్ముళ్ళనే బకరాలను చేస్తారన్న మాట. ఇదంతా అచ్చెన్న ఇపుడు చెప్పిన దాని బట్టే అర్ధం చేసుకోవాల్సివస్తోందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.