నాకే కాదు, నాలాంటి వాళ్లను కొంత కాలంగా కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. అవి కూడా కొన్ని రాజ్యాంగ వ్యవస్థల గురించి. అదేమంటే ఆ రాజ్యాంగ వ్యవస్థల గురించి విమర్శ చేయకూడదట. నోరు తెరిస్తే నేరమవుతుందట! చెడు వినకు, చెడు మాట్లా డకు, చెడు చూడకు అని మహాత్మాగాంధీ ఉపదేశించారని విన్నాం. కానీ ఇదేమిటీ, కొన్ని రాజ్యాంగ వ్యవస్థలకు మాత్రమే మినహాయింపు ఏంటి? పోనీ రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలకు ఇలాంటి మినహాయింపులు ఉండాలి కదా? మరి అలా లేదే? ఎందుకని? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?
ఇటీవల ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం అనే రాజ్యాంగ వ్యవస్థలో చోటు చేసుకున్న పరిణామాలు గుర్తొస్తున్నాయి. సదరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఐదు పేజీల లేఖ రాశారు. ఈ లేఖపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా రచ్చరచ్చ చేశాయి. దీంతో ఏపీ సర్కార్ ఎన్నికల కమిషనర్ అర్హతలకు సంబంధించి నిబంధనలు మార్చారు. దీంతో సదరు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవి నుంచి దిగి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల అధికారిగా ఓ రిటైర్డ్ జడ్జి నియమితులయ్యారు.
ఇదిలా ఉంటే ఆ లేఖపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేయడం, దానిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. సీఐడీ దర్యాప్తులో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. అసలు ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో తయారు కాలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, దాన్ని టీడీపీ నాయకులు తయారు చేశారని అనధికార సమాచారం. అంటే ఓ రాజ్యాంగ వ్యవస్థ టీడీపీ కార్యాలయంగా వ్యవహరించిందన్న మాట.
ఈ నేపథ్యంలో కొన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని, వాటి పనితీరుని గత కొంత కాలంగా పరిశీలిస్తుంటే…రాష్ట్ర ఎన్నికల సంఘాన్నే గుర్తు తెస్తున్నాయి. అవి కూడా టీడీపీ కార్యాలయాల్లా పనిచేస్తున్న భావనే ఉంది. ఇంకా చెప్పాలంటే సదరు వ్యవస్థల్లోని కీలక వ్యక్తు లకు టీడీపీ కార్యాలయం నుంచి ఏవైనా స్క్రిప్ట్‌లు వెళుతున్నాయేమో అనే అనుమానం కూడా లేకపోలేదు.
పరిధికి మించి వ్యవహరిస్తూ తమ పదవులకు, రాజ్యాంగ వ్యవస్థలకు మచ్చ తేవడం బాధ కలుగుతోంది. ఏదైనా సాటి రాజ్యాంగ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినప్పుడు, ఆ తప్పు చేసిన వ్యక్తులు లేదా సంస్థలు కూడా రియలైజ్ అయ్యేలా ఉండాలి. తమకు కనువిప్పు కలిగించినందుకు సదరు వ్యవస్థ పట్ల కృతజ్ఞతా భావన కలిగేలా వ్యవహరించాలి. ఇంత వరకూ ఫోర్త్ ఎస్టేట్‌గా పిలుచుకునే మీడియాలో ఎల్లో వైరస్ చూశాం. మరికొన్ని వ్యవస్థల్లో ఆ వైరస్‌ను ఇప్పుడిప్పుడే చూడాల్సి వస్తోంది. అంతా కరోనా మాయ.
తమనెవరూ ప్రశ్నించజాలరని అనుకుంటూ ఇష్టానురీతిలో వ్యవహరిస్తే చివరికి ఏదో ఒకరోజు ప్రజల్లో అభాసుపాలు కాక తప్పదు. పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదనే సామెత ఉంది. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆదరణతో గద్దె నెక్కిన ప్రభుత్వాలను ఇతరేతర మార్గాల ద్వారా భ్రష్టు పట్టించాలనే ప్రక్రియలో తాత్కాలికంగా విజయం కూడా సాధించవచ్చు. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని హితవు చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఎదురొడ్డి విజయం సాధించిన మరో వ్యవస్థ ప్రపంచంలో ఇంత వరకూ ఎక్కడా లేదు.
-సొదుం