దేశంలో అత్యథికంగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ కూడా ఒకటి. దేశ రాజధాని ప్రజలు కరోనాతో బిక్కుబిక్కుమంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని హత్యకు కుట్ర పన్నాడు ఓ వ్యక్తి. మొత్తం కుటుంబానికే విషం ఇచ్చి చంపాలనుకున్నాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టింది. ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు అతడు.
అలీపూర్ కు చెందిన ప్రదీప్, తన భార్యతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. అయితే అదే అపార్ట్ మెంట్ లో వాచ్ మేన్ గా పనిచేస్తున్న వ్యక్తితో తన భార్య ఎఫైర్ పెట్టుకుందని ప్రదీప్ అనుమానం. అందుకే వాచ్ మేన్ ను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. దీనికి కరోనాను సాకుగా వాడుకోవాలని అనుకున్నాడు.
వాచ్ మేన్ కుటుంబాన్ని చంపడానికి ఇద్దరి మహిళలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్రదీప్. వాళ్లతో ఆరోగ్య కార్యకర్తల వేషం వేయించాడు. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు మందు ఇస్తున్నామని చెప్పి వాళ్లు వాచ్ మేనే ఇంటిలోకి ప్రవేశించారు. విషం కలిపిన బాటిల్ ను వాళ్లకు అందజేశారు.
కుట్రను గ్రహించలేకపోయిన వాచ్ మేన్ కుటుంబం విషం కలిపిన ఆ మందును తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చుట్టపక్కల జనాలు వాళ్లను హాస్పిటల్ కు చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫూటేజ్ ఆధారంగా ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కింద వీళ్ల ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి.