దివంగత ఎన్టీఆర్ తనయ భువనేశ్వరి మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఎక్కడా ఆమె ప్రచారానికి నోచుకోరు. తన పనేంటో అంత వరకే పరిమితమవుతారు. అరుదుగా తప్ప భర్త చంద్రబాబునాయుడితో కలిసి ఆమె కనిపించరు. కారణాలేవైనా ఇటీవల ఆమె వార్తల్లో తరచూ కనిపిస్తున్నారు. చెప్పుకోడానికి గర్వపడే విషయం కాదు. ఏపీలో దిగజారిన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని ఆమెను రాజకీయాల్లోకి లాగుతున్నారు.
భువనేశ్వరిపై అసభ్య కామెంట్స్ చేయడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితం నందమూరి కుటుంబ సభ్యులంతా మీడియా ముందుకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదగా మాట్లాడాలని హితవు చెప్పారు. మరోసారి అవాకులు చెవాకులు పేలితే కథ వేరేలా వుంటుందని హెచ్చరించారు. నందమూరి వారి ఆవేదన అర్థం చేసుకోదగ్గది.
భువనేశ్వరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఏకంగా అసెంబ్లీ సమావేశాల్నే బహిష్కరించారు. తాజాగా తాను అసెంబ్లీకి వెళ్లడంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవులందరినీ ఓడించి అప్పుడు గౌరవ సభకు వస్తానని చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడానికి దారి తీసిన బాధాకర పరిస్థితుల గురించి ప్రజలకు పదేపదే గుర్తు చేయాలని తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన సూచించడం గమనార్హం. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇంతగా దిగజారాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఎవరైనా తమ భార్యను ఫలానా విధంగా దూషించారని ప్రచారం చేసుకోడానికి ఇష్టపడతారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా తన జీవిత భాగస్వామిని తిట్టారని ప్రచారం చేయాలని ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిజంగా భువనేశ్వరిని అవమానిస్తున్నదెవరు? ఆమెను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదెవరు? అనే ప్రశ్నలు తెరముందుకు వచ్చాయి. దీనికి సమాధానంగా …ముమ్మాటికీ చంద్రబాబే దోషి అని చెబుతున్నారు.
భార్య గౌరవాన్ని కాపాడాల్సిన చంద్రబాబు, అందుకు విరుద్ధంగా ఆమెకు అవమానం జరిగిందనే సాకుతో రాజకీయ లబ్ధి పొందాలనే తపనను సభ్య సమాజం అంగీకరించలేని పరిస్థితి. మరి చంద్రబాబుకు మాత్రం భార్య గురించి ప్రచారం చేసుకోవాలనే కోరిక ఎందుకు కలిగిందో అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.