సినిమా రంగంలో కొందరి ఖర్చులు ఓ రేంజ్ లో వుంటాయి. డిమాండ్-సప్లయ్ ఆధారంగా వ్యవహారాలు నడుస్తాయి కనుక, భరించక తప్పదు. టాలీవుడ్ లో ఇప్పుడు సంగీత దర్శకుల కొరత నడుస్తోంది. ఎవర్ని ట్రయ్ చేసినా, అంతా ఎసి డిసిగా వుంది వ్యవహారం. ఇలాంటి నేపథ్యంలో డిమాండ్ వున్న ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లలో ఒకరి వ్యవహారం నిర్మాతలకు కాస్త భారంగా వుంటోందని తెలుస్తోంది.
సదరు మ్యూజిక్ డైరక్టర్ తరచు చెన్నయ్ నుంచి హైదరాబాద్ వస్తారట. ఆ ఖర్చు అప్పటికి చేస్తున్న ఎవరో ఒకరి సినిమా మీద పడుతుంది. చెన్నయ్ నుంచి హైదరాబాద్ కు తన కంప్యూటర్ సామగ్రి తీసుకురావడానికి, టికెట్లకు కొంత ఖర్చు. ఆ తరువాత ఆయన పార్క్ హయాత్ లోనే వుంటారు. వేరే హోటల్ అన్నా, గెస్ట్ హవుస్ అన్నా అంగీకరించరు. ఆవాసా లాంటి పదివేలతో పోయే హోటల్ లో వుండమన్నా నో అంటారు.
పార్క్ హయాత్ లో కూడా ఖరీదైన సర్వీస్ అపార్ట్ మెంట్ లోనే. అక్కడేవుంటూ, హాయిగా సాయంత్రం వేళ తన నేస్తాలతో క్రికెట్ ఆడుకుంటూ, మధ్యలో సినిమా పని చూసుకుంటూ వుంటారన్నమాట. పోనీ అలా అని ఒకటి రెండో రోజుల్లో పని అయిపోతుందా? అంటే చెప్పలేం. ఆయనకు ఎన్నాళ్లు హైదరాబాద్ లో వుండాలనిపిస్తే, అన్నాళ్లు పడుతుంది అని ఇండస్ట్రీ టాక్.
ఇక్కడే ఓ ఆఫీసు, స్టూడియో, ఎక్విప్ మెంట్ పెట్టుకోవచ్చు కదా? దానికి కొంచెం చార్జ్ చేస్తే సరిపోతుంది కదా? నిర్మాతలకు చాలా మిగుల్తుంది. పైగా సదరు సంగీత దర్శకుడు కోటి నుంచి కోటిన్నర తీసుకుంటారు. స్టూడియోకి ఎంతోకొంత చార్జ్ చేసినా నిర్మాతలు ఫీల్ కారు. అలా చేయకుండా ఇలా పార్క్ హయాత్ బిల్లులు చెల్లించడం అంటే చిన్నా, చితకా ఇబ్బంది కాదు కదా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.