ఏపీ ప్రభుత్వం పై అనుచితంగా స్పందించిన వారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెగ నరుకుతామని ప్రకటించిన వారికి కూడా.. అందుకు సంబంధించి చట్టపరమైన చర్యలు మొదలు కాగానే, ప్రాణాలపై భయం మొదలవుతుంది! జగన్ ప్రాణాలను తీస్తామంటూ టీవీ చానళ్లలో ప్రకటించిన వారికి, జైలుకు వెళ్లాకా మాత్రం… తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి విడ్డూరాలకు వేదిక అవుతోంది ఏపీ.
ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబం కూడా అదే భయంతో ఉందట. ఈ మేరకు దేవినేని ఉమ భార్య దేశంలోని పలువురు ప్రముఖులకు ఈ అంశంపై లేఖలు రాశారు. తన భర్త ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, అలాగే తమ ఆస్తులకు కూడా నష్టం కలిగించనున్నారని.. ఆమె పలువురు ప్రముఖులకు లేఖ రాశారు.
ప్రస్తుతం దేవినేని ఉమ పోలిస్ కస్టడీలో ఉన్నారు. ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య తన ప్రాణాలకు జైల్లో ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు, ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాయడం గమనార్హం.
అలాగే ఏపీ గవర్నర్ కూ, ఏపీ హోం మంత్రి సుచరితకు కూడా ఆమె లేఖలు రాశారు. తన భర్త ప్రాణాలకు, తమ ఆస్తులకు ముప్పు పొంచి ఉన్నట్టుగా ఆ లేఖల్లో పేర్కొన్నారట. అయినా.. కేసుల్లో అరెస్టు కాగానే, టీడీపీ నేతలకు ఏకంగా ప్రాణాల మీదకే భయం కలుగుతూ ఉండటం గమనార్హం.
ప్రభుత్వాన్నే కాదు.. పోలీసులను కూడా టీడీపీ నేతలు అస్సలు నమ్మడం లేదు. పోలీసులను ఇష్టానుసారం దూషించడానికి కూడా టీడీపీ నేతలు ఈ మధ్య అస్సలు వెనుకాడటం లేదు.