రెండు ఉద్యోగాల హనీమూన్ అయిపోయినట్టే

కొందరికి ఒక ఉద్యోగం దొరకకే కిందా మీదా పడుతుంటే కొంత మంది రెండు మూడు ఉద్యోగాలు ఒకేసారి చేస్తున్న వాళ్లున్నారు. ప్రపంచం మీద కరోనా విధ్వంసం చేస్తే కొందరికి మాత్రం అది వరంగా మారింది. …

కొందరికి ఒక ఉద్యోగం దొరకకే కిందా మీదా పడుతుంటే కొంత మంది రెండు మూడు ఉద్యోగాలు ఒకేసారి చేస్తున్న వాళ్లున్నారు. ప్రపంచం మీద కరోనా విధ్వంసం చేస్తే కొందరికి మాత్రం అది వరంగా మారింది. 

లాక్డౌన్ల కాలంలో వర్క్ ఫ్రం హోం కి వెసులుబాటిచ్చిన అన్ని కంపెనీలకూ ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాయి. ఉద్యోగులు తమ ట్యాలెంట్ ని పణంగా పెట్టి తాము చేస్తున్న కంపెనీకే అంకితమై పని చెయ్యాలనుకుంటాయి ఏ కంపీనీలైనా. భార్య తన భర్త తనకే సొంతమని ఎలా భావిస్తుందో ట్యాలెంటున్న తమ ఉద్యోగులను ఆయా కంపెనీలు కూడా అలాగే భావిస్తాయి. 

కానీ వర్క్ ఫ్రం హోం వల్ల అనేకమంది ఉద్యోగులు పక్కదారులు తొక్కారు. డెడికేటెడ్ గా వేరు వేరు లాప్ టాపులు పెట్టుకుని ఒక కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తూనే మరో కంపెనీకి కన్సెల్టెంట్ గా సేవలందిస్తున్నవారు అనేకమంది తయారయ్యారు. నిజానికి ఆయా కంపెనీలు కాంపిటీటర్లు. సహజంగానే ఈ విషయం తెలిసి అనేక కంపెనీలు డిస్టర్బ్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే కొన్ని కంపెనీలు మాత్రం…ఎక్కడ పని చేస్తే ఏముందిలే… మా కంపెనీ టాస్క్ కంప్లీట్ చేస్తే చాలు అనే ధోరణిలో ఉంటున్నాయి. అయితే ఇలా ఆలోచిస్తున్నవి చిన్న కంపెనీలు మాత్రమే. ఎందుకంటే ఈ రేంజ్ కంపెనీలకి వర్క్ ఫ్రం హోం వల్ల ఆఫీస్ రెంటల బెడద తప్పింది. ఓవర్ హెడ్ ఖర్చులు లేకుండా మంచి లాభాలు ఆర్జించడం, కుదిరితే కాంపిటీటివ్ గా తక్కువ ధరలకే సాఫ్ట్ వేర్ సేవలు అందించడం చేస్తున్నాయి. 

కానీ పెద్ద కంపెనీలకు మాత్రం అలా లేదు. రోజూ ఆఫీసులకొచ్చి పని చెయ్యమంటే కరోనా సాకు చెప్పి ఇంట్లోనే కూర్చుంటున్నారు సదరు ఉద్యోగులు. కానీ మాల్స్ కి, సినిమాలకి మాత్రం మూతి మీద మాస్క్ కూడా లేకుండా హాయిగా తిరిగేస్తున్నారు. మళ్లీ ఆఫీసులకెళ్లడం మొదలు పెడితే రెండు చేతులా సంపాదన ఉండదు కదా! అదీ బాధ!

ఈ కరోనా కాలంలో కొంత మంది ఆఫీసులకి 50-60 మైళ్ల దూరంలో కూడా ఇళ్లు కొనేసుకున్నారు. వర్క్ ఫ్రం హోం అయినప్పుడు ఎక్కడుంటే ఏముంది? 

ఇప్పుడు రోజూ ఆఫీసంటే శ్రమతో పాటూ డీజిల్, పెట్రోల్ ఖర్చు..బయట తినడాలు..అన్నీ మామూలే. ఇప్పుడవన్నీ మిగులుతున్నాయన్న ఆనందం ఎన్నో నాళ్లు ఉండేట్టు లేదు. 

ఎందుకంటే అమెరికా అయినా, ఇండియా అయినా ప్రభుత్వాలన్నీ రియల్ ఎస్టేట్ దెబ్బతినడం, కమెర్షియల్ కాంప్లెక్సులు ఖాళీగా పడి ఉండడం, కొత్త కాంప్లెక్సుల కొనుగోళ్లు, కట్టడాలు లేకపోవడం వంటి వాటితో సతమతమవుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం మందగించింది. 

కనుక ఇకపై ప్రభుత్వాలు కూడా ప్రజల్ని మళ్లీ రోడ్ల మీదకి పరుగెత్తించి ఆఫీసులకి చేర్చాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఈ దిశగా పెద్ద ప్రైవేట్ కంపెనీల మీద ఒత్తిడి పెంచి ఉద్యోగుల్ని రోజూ ఆఫీసుకి రమ్మనేలా చేసే ఆలోచనలో ఉన్నాయి. 

నిజానికి జనం సొమ్ముతో నడిచే పెద్ద లిమిటెడ్ కంపెనీలు ఒక పనికి నలుగురు ఉద్యోగుల్ని పెట్టుకుంటాయి. దానివల్ల అందరికీ రోజూ 8 గంటల పని ఉండదు. మహా అయితే ఒకటి రెండు గంటలు సీరియస్ గా పని చేసి తర్వాత రిలాక్స్ అయిపోయి సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే వాళ్లే ఎక్కువ. వీరిలో చాలా మంది సమయం వృధా చేయకుండా రియలెస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అమెరికాలో గానీ, ఇండియాలో కానీ ఎమ్మెన్సీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకుని కోట్లకు పడగలెత్తింది వీళ్లే. ఇన్నాళ్లూ వీళ్లకి మాత్రమే ఉండే ఈ వెసులుబాటు. ఇప్పుడు మధ్య స్థాయి కంపెనీల్లో పని చేసే వాళ్లకి కూడా వర్క్ ఫ్రం హోం వల్ల రెండు చేతులా సంపాదించుకునే అవకాశం చిక్కింది. 

కానీ ఇక ఆ పుణ్యకాలం పోతోంది. రోజూ ఆఫీసుకొచ్చి పని చేస్తేనే ఉద్యోగముంటుంది లేకపోతే కొత్త వాళ్లని రిక్రూట్ చేసుకుంటామనే దిశగా కొన్ని కంపెనీలు కదులుతున్నాయి. 

ఎటొచ్చీ మరీ చిన్న కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోం ని ఇలాగే కొనసాగిస్తూ, తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని నడిపే ఆలోచనలో ఉన్నాయి. వాటిల్లో పని చేసే వాళ్లకి మాత్రం తక్కువ మొత్తాల్లో రెండు సంపాదనలు చేసుకునే అవకాశం కొనసాగుతుంది. 

పెద్ద,మధ్య స్థాయి కంపెనీల్లో పని చేసే వాళ్లకి మాత్రం ఇక ఆ హనీమూన్ అయిపోయినట్టే. 

– శ్రీదేవి కంచికచెర్ల