సౌత్ సినిమాలంటే వెర్రెక్కినట్టుగా కనిపిస్తోంది బాలీవుడ్. హిందీ స్టార్ల సినిమాలు హిందీయేతర భాషల వారి సంగతిని అటుంచి, కనీసం హిందీ బెల్ట్ లో కూడా ఆకట్టుకోలేకపోతున్నాయి. విజయాల విషయంలో బాలీవుడ్ ఇప్పుడు అంత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. బాలీవుడ్ ఈజ్ బ్లీడింగ్ అంటున్నారు అక్కడి సినీ విశ్లేషకులు. బాలీవుడ్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయని అక్కడి తారలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు! ఇలా ఉంది పరిస్థితి.
మరి ఇలాంటి నేపథ్యంలో సౌత్ సినిమాల అనువాదాలు, రీమేక్ ల పనిలో బాలీవుడ్ బిజీగా ఉంది. ఇదే అదునుగా సౌత్ స్టార్ హీరోలు హిందీలో తమ మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు సౌత్ సినిమాలకు బాలీవుడ్ టికెట్ తేలికగా లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం బాలీవుడ్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతూ ఉండటమే.
ఆ సంగతలా ఉంచితే.. ఈ పరిస్థితుల్లోనే సౌత్ స్టార్ల బాలీవుడ్ ఎంట్రీలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది వరకూ బాలీవుడ్ లో వచ్చిన గుర్తింపుతో సౌత్ సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. బాలీవుడ్ నటీనటులను తెచ్చి నటింపజేసుకునేందుకు సౌత్ సినిమాల రూపకర్తలు కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్లు చదివించుకునే వారు. బాలీవుడ్ లో చోటా హీరోయిన్ కు కూడా సౌత్ లో కోటి రూపాయల రెమ్యూనిరేషన్ చెక్ అందేది! దశాబ్దాల నుంచినే ఈ పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సౌత్ తారలను హిందీ సినిమాలో చూపించేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపిస్తున్నారు.
సౌత్ లో వెలుగుతున్న వారికి బాలీవుడ్ అవకాశాలు వెంటపడుతున్నాయి. ఇందులో భాగంగా నయనతార, విజయ్ సేతుపతి, రష్మిక వంటి వారికి హిందీ అవకాశాలు వరసగా లభిస్తున్నాయి. వీరి సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేసుకుంటున్నాయి. రష్మికకు ఇప్పటికే చేతిలో చెప్పుకోదగిన బాలీవుడ్ ఆఫర్లున్నాయి. అలాగే విజయ్ సేతుపతిని బాలీవుడ్ తీసుకెళ్తోంది. షారూక్ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది నయనతార. ఆ సినిమాకు దర్శకుడు కూడా సౌత్ డైరెక్టరే! వీరే కాదు.. సౌత్ సినిమాలతో గుర్తింపును, ఇక్కడ స్టార్ స్టేటస్ పొందిన మరింత మందికి బాలీవుడ్ అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు మరికొందరు హిందీ సినిమాల్లో నటించేందుకు సై అంటున్నారు.