భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తనకు వీలైన రాష్ట్రాలలో విచిన్న రాజకీయాలకు పాల్పడుతోందనే ఆరోపణలు చాలా కాలం నుంచి వినవస్తున్నవే. రాష్ట్రాలలో తాము అధికార పీఠం మీదికి రావడానికి తమ ప్రత్యర్థి పార్టీని ప్రలోభ పెట్టి, లేదా కేసులరూపేణా భయపెట్టి ఆ పార్టీ నిలువునా చీల్చడం ద్వారా కమలదళం లబ్ధి పొందుతున్నదని ఆరోపణలు అనేకం ఉన్నాయి. కేవలం ఆరోపణలు కాదు అందుకు రుజువులు కూడా అనేక ఉన్నాయి. అయితే తాజాగా, తమకు అవసరం లేకపోయినా సరే.. తాము అధికారంలోనే ఉన్నప్పటికీ కూడా.. ప్రతిపక్ష పార్టీని ముక్కలుగా చీల్చే రాజకీయానికి పాల్పడడం చర్చనీయాంశం అవుతుంది.
గోవాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ ను దాదాపుగా కనుమరుగు చేసేసింది. కాంగ్రెస్ కు గోవా అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా అందులో ఎనిమిది మంది తాజాగా కమలదళం తీర్థం పుచ్చుకున్నారు. వారి మీద పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింప చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మూడింట రెండు వంతుల మంది కాంగ్రెస్ ను విడిపోవడంతో వారిపై అనర్హత వేటు వేయడానికి అవకాశం లేదు.
నిజానికి గోవాలో ప్రత్యర్థి పార్టీలలో చీలిక తేవాల్సిన అవసరం బిజెపికి లేదు. మొత్తం 40 సీట్లు ఉన్న అసెంబ్లీలో… బిజెపికి 20 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాలతో కలిసి వాళ్ళ ప్రభుత్వమే పరిపాలన సాగిస్తోంది. 11 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ నామమాత్రంగా ప్రతిపక్షంగా ఉండవలసిందే. అయినప్పటికీ కూడా బిజెపి ఆ పార్టీలో చీలిక తెచ్చింది.
ఒకవైపు భారత్ జోడో అంటూ కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ దేశవ్యాప్త పాదయాత్ర సాగిస్తున్న సమయంలోనే.. గోవాలో కాంగ్రెస్ ను ముక్కలు చేయడం విశేషం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన వారిలో మాజీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సహా అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ చీలిక ద్వారా రాష్ట్రాలలో ప్రత్యర్థి పార్టీలను నిర్మూలించే లక్ష్యంలో కమలదళం మరొక అడుగు ముందుకు వేసింది అని అనుకోవాలి.
ముంబాయిలో శివసేనలో చీలిక తెచ్చిన బిజెపి, ఆ వర్గంతో కలిసి అధికార పీఠం ఎక్కడం ద్వారా తన మార్కు రాజకీయాలకు ఇటీవల కాలంలో పదును పెట్టింది. తర్వాత పరిణామాలలో తమ పార్టీలో చీలిక కోసం కుట్ర చేస్తున్నదనే భయంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిజెపితో పొత్తులు వీడి ఆర్జేడితో కలిసి అధికారంలోకి వచ్చారు. తమ పార్టీలో చీలిక కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయల ఎరవేస్తున్నదని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకు తానే బలపరీక్షకు వెళ్లి నెగ్గడం ద్వారా కొంత స్థిరత్వం పొందారు.
జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కూడా బిజెపి చీలిక రాజకీయాలకు జడిసి, తమ ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించి అటు నుంచి స్వయంగా బలపరీక్ష స్వీకరించడం ద్వారా ప్రస్తుతానికి గండం తప్పించుకున్నారు. తాము అధికారంలో లేని చోట అధికార పార్టీలలో చీలిక తేవడానికి బిజెపి కుట్రలు సాగిస్తున్నదని అందరూ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. తాము అధికారంలో ఉన్నచోట కూడా ప్రత్యర్థి పార్టీలో చీలిక తేవడానికి వెనకాడం అని తాజాగా గోవా దృష్టాంతంతో భారతీయ జనతా పార్టీ నిరూపించుకుంది.