ఎటు తిరిగీ భారతీయ జనతా పార్టీని మచ్చిక చేసుకోవాలి.. ఎలాగూ పవన్ కల్యాణ్ తనవాడే.. కాబట్టి.. బీజేపీని మచ్చిక చేసుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శతథా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, జనసేనల కోటా కింద భారీ ఎత్తున సీట్లను ఇవ్వడానికి కూడా సై అనే సంకేతాలను ఇస్తున్నారట తెలుగుదేశం అధినేత. ఇందుకుగానూ.. చంద్రబాబు ఆఫరే పది ఎంపీ సీట్ల వరకూ ఉందని వినికిడి!
బీజేపీ, జనసేనల కోటా కింద పది ఎంపీ సీట్లను ఇచ్చి రెండు పార్టీలనూ ముగ్గులోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఏపీలో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లున్నాయి. అందులో ఏకంగా పది ఎంపీ సీట్లను బీజేపీ, జనసేనలకు కేటాయిస్తుందట తెలుగుదేశం పార్టీ. ఈ ఎంపీ సీట్లను చూసైనా తమతో పొత్తుకు బీజేపీ ముందుకు వస్తుందనేది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.
ఎలాగూ బీజేపీకి ప్రధాన అవసరం ఎంపీ సీట్లే. కాబట్టి.. పది అనే ఫిగర్ తో ఆ పార్టీని చంద్రబాబు తన వన్ సైడ్ లవ్ లోకి దించే ప్రయత్నం చేస్తున్నారట! పాతిక ఎంపీ సీట్లలో పది పోతే.. తెలుగుదేశం పార్టీ ఖాతాలో 15 మాత్రమే మిగులాయి.
2014 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఐదు ఎంపీ సీట్లనేమో కేటాయించినట్టుగా ఉంది. ప్రస్తుతం ఆ నంబర్ ను రెట్టింపు చేసి మరీ పొత్తుకు ఆహ్వానిస్తున్నారట తెలుగుదేశం అధినేత!
అయితే బీజేపీ, జనసేనలకు కలిపి పది ఎంపీ సీట్ల ఆఫర్ ను ఇస్తున్నారట. జనసేనకు రెండో మూడో ఎంపీ సీట్లు, బీజేపీకి ఏడెనిమిది ఎంపీ సీట్లు అనుకోవాలి! ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలనే తపనతో ఉన్న చంద్రబాబు వైపు నుంచినే ఈ మేరకు ప్రతిపాదనలు వెళ్తున్నాయట. మరి ఈ పొత్తు వ్యూహాలు ఎంత వరకూ ఫలిస్తాయో!